ఈ ‘రాజ మహల్‌’ పైనే జాతీయ మీడియా దృష్టి!

కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రుషికొండవైపు ఎవరినీ వెళ్లనీయలేదు.

Update: 2024-06-19 07:13 GMT

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన అంశం.. రుషికొండ. విశాఖపట్నంలో సముద్ర తీరాన ఉన్న రుషికొండ బీచ్‌ ఒడ్డున ఉన్న రుషికొండకు నున్నగా గుండు కొట్టినట్టు కొట్టి వాటిపైన పర్యాటక రిసార్టుల ముసుగులో జగన్‌ ప్యాలెస్‌ నిర్మించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్ల ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి. చివరకు జగన్‌ విశాఖ నుంచి పరిపాలించడానికి రుషికొండపై నిర్మించిన ఈ భవనాలయితే అనుకూలంగా ఉంటాయని.. ఐఏఎస్‌ అధికారులతో నియమించిన త్రీమెన్‌ కమిటీతో చెప్పించిందనే విమర్శలున్నాయి.

ఎన్నికల ఫలితాల్లో జగన్‌ కు అనుకూలంగా ఫలితాలు వచ్చి.. వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడి ఉంటే ఈపాటికి రుషికొండపై ఉన్న భవనాల్లో జగన్‌ కొలువుదీరేవారు. తన ప్రమాణస్వీకారం విశాఖలోనే ఉంటుందని.. జూన్‌ 9 ప్రమాణస్వీకారం చేస్తానని ఎన్నికల ముందు జగన్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్టు వైసీపీ ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా కొట్టుకుపోయింది, కేవలం 11 స్థానాలు మాత్రమే సాధించి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో వైఎస్‌ జగన్‌ కలలు కల్లలయ్యాయి.

కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రుషికొండవైపు ఎవరినీ వెళ్లనీయలేదు. పర్యాటకులతోపాటు చివరకు జనసేనాని పవన్‌ కళ్యాణ్, టీడీపీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తదితరులను సైతం అడ్డుకున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్, అటవీ శాఖల అనుమతులు కూడా తీసుకోకుండా రుషికొండను తొలిచి ఈ భవనాలను నిర్మిస్తున్నారని హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రుషికొండ వైపు ఎవరినీ వెళ్లనీయకుండా భవనాలను నిర్మించింది. చివరకు ఈ భవనాలు సీఎం వైఎస్‌ జగన్‌ ఉండటానికి అనుకూలమని.. ప్రభుత్వం నియమించిన త్రీమెన్‌ కమిటీ చెప్పింది.

అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రుషికొండ భవనాల్లోకి వెళ్లడానికి ఆటంకాలు, ఆంక్షలు తొలగిపోయాయి. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇంచార్జి పంచకర్ల సందీప్, మీడియా ప్రతినిధులు తదితరులు రుషికొండ భవనాలను సందర్శించి.. ఆ భవనాలను వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆ చిత్రాలను చూసినవారు అవి భవనాలు కాదని.. ప్యాలెస్‌ లను తలపించేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఇప్పుడీ అంశం జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. ప్రముఖ న్యూస్‌ చానెల్‌ రిపబ్లిక్‌ రుషికొండ ప్యాలెస్‌ పై ప్రత్యేక చర్చ చేపట్టింది. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డిలకు ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామి ఈ అంశంపై పలు ప్రశ్నలు సంధించారు.

ఈ డిబేట్‌లో, జగన్‌ రాజమహల్‌ ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ తరహా ప్యాలెస్‌ ని తలపిస్తోందని అర్ణబ్‌ గోస్వామి అన్నారు. ఇది చాలా చాలా విలాసవంతమైన ఖర్చుతో కట్టినట్టు ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్‌ రాజ కుటుంబం నివాసం ఉండేత బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ కంటే ఈ ప్యాలెస్‌ చాలా గొప్పదని కొంతమంది ప్రజలు భావిస్తున్నారని ఆయన ఉటంకించారు.

రుషికొండ ప్యాలెస్‌ లో విలాసవంతమైన బాత్‌ టబ్‌ లు ఉన్నాయని.. బాత్‌ టబ్‌ విలువ రూ.36 లక్షలని.. దీనిపై మీరు ఏం చెబుతారని చర్చలో పాల్గొన్న వైసీపీ అధికారి ప్రతినిధిని అర్ణబ్‌ ప్రశ్నించారు. దీంతో ఆయన సమాధానం చెప్పడానికి నీళ్లు నమిలారు.

రుషికొండ ప్యాలెస్‌ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనే పాపులర్‌ కాగా ఇప్పుడు జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరెన్ని సంచలనాలకు వేదికవుతుందో వేచిచూడాల్సిందే.

Full View
Tags:    

Similar News