దెబ్బకు దెబ్బ...వేటుకు వేటు...అదుర్స్ !

ఈ మాటలు ఎక్కడో విన్నట్లుగా ఉన్నాయి కదూ. ఇదే బాలయ్య సినిమా డైలాగు.

Update: 2024-06-23 12:45 GMT

ఈ మాటలు ఎక్కడో విన్నట్లుగా ఉన్నాయి కదూ. ఇదే బాలయ్య సినిమా డైలాగు. ఇదే నారా లోకేష్ చాలా సార్లు వాళ్ళ మామ మాదిరిగా డైలాగుని అనేక సభలలో వాడారు. సరిగ్గా అదే ఇపుడు ఏపీలో జరుగుతోంది. సరిగ్గా అయిదేళ్ళకు ముందు 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చేసిన మొట్ట మొదటి పని ప్రజా వేదిక కూల్చివేత. అది అక్రమ కట్టడం అని పేర్కొంటూ జగన్ ప్రభుత్వం దాన్ని కూలదోయించింది. అయితే ఆ సమయంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. టీడీపీ వర్గాలు అయితే ఇది విద్వంసక ప్రభుత్వం అని విమర్శించారు.

ఇక తటస్థ వర్గాలతో పాటు కొందరు మేధావులు సైతం కూల్చడం అంటే ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లని భావించారు. ఆ విధంగా కాకుండా దానిని ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటే బాగుండేది అని కూడా అన్నారు. ఒక విధంగా ప్రజా వేదిక కూల్చివేతతో వైసీపీ ప్రభుతం తన యాక్షన్ ప్లాన్ ని స్టార్ట్ చేసింది అని చెప్పాలి.

ఇక సీన్ కట్ చేస్తే ఇపుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ అక్రమంగా పార్టీ ఆఫీసులను కడుతోందని పేర్కొంటూ వాటిని కూలగొడుతోంది. దానిని నాందిగా గుంటూరు జిల్లాలో ఒక దానిని కూలగొట్టారు. లీజుకు తీసుకుని కట్టడాలు నిర్మిస్తున్నా కూడా హై కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మరీ కూల్చేస్తున్నారు అని వైసీపీ వాపోతోంది.

హై కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఈ విధంగా కూల్చడం తగునా అని వైసీపీ అంటోంది. అయినా అధికారం ఇపుడు చేతులు మారింది. దాంతో ఇలా జరుగుతోంది అని అంటున్నారు. అలా ప్రజా వేదిక కూల్చివేతకు ఇది జవాబు అనుకోవాలా లేక దీనికి రెట్టింపు అనుకోవాలా అంటే జవాబు తరువాత తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి అయితే ప్రజా వేదిక కూల్చివేత వర్సెస్ వైసీపీ ఆఫీసు కూల్చివేత అని అంటున్నారు.

నిజానికి ప్రజలు ఓట్లు వేసేది ప్రభుత్వాన్ని తెచ్చేది తమకు మేలు చేయడం కోసం అన్నది ప్రజా స్వామ్యంలో అందరికీ తెలిసిన విషయం. అలాగే అందరికీ అర్ధం అయిన విషయం. కానీ గత వైసీపీ తీరు చూసినా ఇపుడు టీడీపీ వ్యవహార శైలి చూసినా దెబ్బకు దెబ్బ వేటుకు వేటు అన్నట్లుగానే కధ సాగుతోంది అని అంటున్నారు.

దీంతో మేధవులు ప్రజాస్వామ్య ప్రియులు అంతా విస్తుబోతున్నారు. ఆలోచనలో పడుతున్నారు. ప్రభుత్వం వచ్చేది ప్రజల కోసమా లేక కక్ష సాధింపు చర్యలు తీసుకొవడానికా అన్న దాని మీద సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రజలకు రాజకీయాలు ఉండవు. వారు దేనినీ పట్టించుకోరు. తమ వరకే వారు చూస్తారు. తమ ప్రయోజనాలు దక్కాయా లేదా అన్నది చూస్తారు.

అలా కాకుండా రాజకీయ కక్షలు కార్పణ్యాలు తీచుకోవడానికి అధికారం ఇవ్వలేదని వైసీపీ విషయంలో నిరూపించారు. వైసీపీ ఒక వైపు సంక్షేమం అందిస్తూనే కక్షలకు తెర లేపింది. టార్గెట్ చేసి మరీ టీడీపీ నేతలను అరెస్టుల మీద అరెస్టులు చేసింది. అలాగే అనేక కేసులు పెట్టింది. ఇదంతా చూసిన జనాలు ఆ ప్రభుత్వం వద్దు అనుకుని ఓటేశారు.

తీరా ఇపుడు చూస్తే మళ్లీ అలాంటి విధానంతోనే ముందుకు పోతామని కొత్త ప్రభుత్వం భావిస్తే కనుక ప్రజలు కూడా ఆలోచిస్తారు అని అంటున్నారు. ఒక నిర్మాణం ఏదైనా కష్టంతో కూడుకున్నదే. దానిని అక్రమం అని తేల్చినపుడు ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వినియోగం లోకి తేవడం మంచి పని. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసేది అని ఆ విధంగా అర్ధం అవుతుంది.

అంతే తప్ప బుల్డోజర్లు ప్రొక్లైనర్లకు పని చెప్పి కూల్చివేతలకు తెర తీస్తే అపుడు విద్వంశం తప్ప ఏమి మిగులుతుంది అని అంటున్నారు. ఎక్కడైనా ప్రజలు లా అండ్ ఆర్డర్ బాగుండాలని కోరుకుంటారు. అది బాగుండాలీ అంటే కక్షలు ఆగిపోవాలి. లేకపోతే ఒక దానికి అవతల వైపు నుంచి కూడా జవాబు వస్తుంది. అలా చూస్తే ఇక ఘర్షణ తప్ప ఏమీ మిగలదు. ఏది ఏమైనా ఇది మంచి పరిణామం కాదని అంటున్నారు. ఏపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి అయినా రాజకీయ పార్టీలు పాలకులు సహనంతో ముందుకు పోవాలని కోరుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News