తెలంగాణ తల్లి రూపం రేవంత్‌కు ప్లస్సా.. మైనస్సా..?

కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ క్రెడిట్ కొట్టేశారు.

Update: 2024-12-08 06:23 GMT

తెలంగాణ మన అస్తత్వం అంటూ టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పోరాడింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. అనుకున్నట్లుగా తెలంగాణ సాధించి పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. అయితే.. ఇక్కడే అందరికీ పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు.. అధికారంలో ఉన్న పదేళ్లపాటు తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ రూపాన్ని ఎందుకు తీసుకురాలేకపోయిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో కూడా తెలియని పరిస్థితి. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ క్రెడిట్ కొట్టేశారు.


దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారు. దాంతో ఎక్కడ కూడా తెలంగాణవాదాన్ని చిన్నచూపు చూడడం లేదు. తెలంగాణవాదులకు ప్రాధాన్యం ఇస్తూనే ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణతల్లి విగ్రహానికి ఓ రూపాన్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పట్టించుకోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి రెడీ చేయించారు. తాజాగా.. తెలంగాణ తల్లి రూపం ప్రభుత్వం విడుదల చేసింది.

ఆకుపచ్చ చీరలో.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా విగ్రహాన్ని రెడీ చేయించారు. ఎలాంటి నగ, ఎలాంటి బంగారు కిరీటాలు లేకుండా సింపుల్‌గా తెలంగాణ మహిళ రూపంతో సిద్ధం చేయించారు. రేపు ఎంతో అట్టహాసంగా సెక్రటేరియట్‌లో ఆవిష్కరించబోతున్నారు. అయితే.. ఇక్కడే రేవంత్ రెడ్డి వ్యవహరించిన చాకచక్యాన్ని సైతం అందరూ అభినందిస్తున్నారు. విగ్రహం నమూనాను ముందే విడుదల చేస్తే ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తాయి. వారు రచ్చ చేయాలనే చూస్తారు. అందువల్ల రేవంత్ విగ్రహావిష్కరణకు మూడు రోజుల ముందు మాత్రమే నమూనాను విడుదల చేశారు. ఇదే సందర్భంలో ప్రజల నుంచి వస్తున్న టాక్‌ను మాత్రమే వీరు లెక్కల్లోకి తీసుకుంటున్నారు.

కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రజల నుంచి మంచి స్పందనే వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతీ తెలంగాణ గ్రామీణ మహిళ కూడా ఆ విగ్రహంలో తమను తాము చూసుకొని మురిసిపోతున్నారని అంటున్నారు. కిరీటాలు, నగల జోలికి పోకుండా.. తమ ఇంటి ఆడబిడ్డనే తెలంగాణ తల్లి అని భావించి.. అదే రూపంలో విగ్రహం ఉండాలని రేవంత్ భావించారు.

బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ వ్యతిరేకులు సాధారణంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బోనం లేదని, బతుకమ్మ లేదని, సిరిసంపదలు ఏవీ లేవని రకరకాల వాదనలు పెడుతున్నారు. కానీ.. ఈ విషయంలో బీఆర్ఎస్‌కు ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదనేది ఆ పార్టీ ఇంకా గుర్తించలేకపోతోంది. ఎందుకంటే.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ తల్లికి ఆ పార్టీ ఓ రూపాన్ని తీసుకురాలేకపోయింది. ఏదో విగ్రహాన్ని తయారుచేయించి పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు తప్పితే.. ఎప్పుడూ దానిని గుర్తించలేదు. అదే విగ్రహాన్ని సెక్రటేరియట్ వద్ద పెట్టి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి దానిని మార్చేందుకు సాహసించేవారు కారేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే.. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం తీసుకొచ్చి.. సగర్వంగా, సంబురంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇది కాస్త.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల నుంచి అడ్వాంటేజీ అయిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News