ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు : సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.;

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ లో ఉంచటానికే డీలిమిటేషన్ చేస్తున్నారని విమర్శించిన సీఎం.. నియోజకవర్గాల పునర్విభజనపై రాష్ట్రాలను సంప్రదించకపోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం తన సుదీర్ఘ ప్రసంగంలో అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు.
డీలిమిటేషన్ పై రాష్ట్రాల అభ్యంతరాలు, అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని తెలంగాణ అసెంబ్లీ ఖండిస్తోందని సీఎం స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న లోక్ సభ నియోజకవర్గాలనే కొనసాగించాలని సూచించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాల్సివున్నా, ఇప్పటివరకు ఆ ప్రక్రియ మొదలు పెట్టలేదని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనం లేదనే కారణంతోనే కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ సీట్లు పెంచలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరుగుతోందని, 1971లో రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ను 25 ఏళ్లు నిలిపేశారని గుర్తు చేశారు. డీలిమిటేషన్ పై గందరగోళం కొనసాగుతోందని, ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశంలో జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను మాజీ ప్రధాని వాజ్ పేయి కూడా వ్యతిరేకించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
డీలిమిటేషన్ పై కేంద్ర నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారని, జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకూడదని సీఎం డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, ప్రస్తుత ప్రతిపాదనల్లో పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ లో పెట్టడానికి చేస్తున్న డీలిమిటేషన్ పై అంతా ఒకే మాట మీద ఉండాలని పిలుపునిచ్చారు.