రేవంత్ మార్క్ రాజకీయం.. బీఆర్ఎస్‌ను ఇరుకున పడేశారుగా..!
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారిక కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారిక కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి వచ్చిన పార్టీలోకి చేరికలు సాధారణం. అందులో భాగంగానే మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే.. వారికి తాము అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పలేదని ఆ పార్టీ నేతలు వాదిస్తుండగా.. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యవహారం మాత్రం అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
శేరిలింగంపల్లి సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ బీ ఫామ్ పై అరికెపూడి గాంధీ గెలుపొందారు. ఆ తరువాత ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అందులో భాగంగానే సీఎంను కూడా కలిశారు. ఆ సందర్భంలో అతని మెడలో కాంగ్రెస్ కండువా వేశారని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ.. అది మామూలు శాలువా లాంటిదేనని కాంగ్రెస్ వాదన. టెక్నికల్‌గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చెప్పారు.
ఈ క్రమంలోనే గాంధీకి రేవంత్ రెడ్డి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అసెంబ్లీ స్పీకర్ అరికెపూడి గాంధీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా ప్రకటించారు. ఇది కాస్త బీఆర్ఎస్ పార్టీకి మింగుడుపడలేదు. పీఏసీ చైర్మన్ పదవిని నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీకే ఇస్తారు. కానీ.. రేవంత్ ఈ విషయంలో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారనేది బీఆర్ఎస్ అంటోంది. గాంధీని తమ పార్టీలో చేర్చుకొని.. తమ ఎమ్మెల్యే అని చెబుతుండడం వింతగా ఉందంటూ వాదిస్తోంది.
ఇక.. తాండూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఇటీవల చీఫ్ విప్ హోదా కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఆయనకు ఆ పదవిని కట్టబెట్టడంపై గులాబీ నేతలు ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన నేతకు అధికారికంగా కాంగ్రెస్ లో చేర్చుకోకుండా ఎలా చీఫ్ విప్ పదవి ఇస్తారని ఇటీవల మాజీ మంత్రి హరీశ్ ప్రశ్నించారు. చీఫ్ విప్ హోదాలో పట్నం మహేందర్ రెడ్డి విప్ జారీచేస్తే అది అధికార పార్టీకి వర్తిస్తుందా..? లేక బీఆర్ఎస్‌కు వర్తిస్తుందా..? అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. మొత్తానికి మండలి చైర్మన్ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంతో ఎలాంటి రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇలా పీఏసీ చైర్మన్, చీఫ్ విప్ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనూ, ఆయా ప్రతినిధుల నియోజకవర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆ కన్ఫ్యూజన్ తొలగడం లేదు. అసలు తమ నేత కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా..? లేక బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారా..? అనేది అంతుపట్టడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే.. అధికారికంగా ఎప్పుడు చేరారు..? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. వీటి వెనుక కాంగ్రెస్ పెద్ద ప్లాన్‌తోనే ఉన్నదని మరో రకంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలకు తమతమ నియోకవర్గాల్లో పట్టు ఉండడంతోపాటు కుల సమీకరణాలు సైతం కలిసొస్తాయని కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించినట్లుగా టాక్ వినిపిస్తోంది. గాంధీ టెక్నికల్‌గా కాంగ్రెస్‌లో చేరకపోయినప్పటికీ పీఏసీ చైర్మన్ పదవి మాత్రం కాంగ్రెస్ ఖాతాలో ఉన్నట్లేనని చెప్పొచ్చు. మొత్తానికి రేవంత్ ముఖ్యమంత్రి అయి పది నెలలే అయినప్పటికీ తన మార్క్ రాజకీయం నడిపిస్తున్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.