ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా.... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో దశాబ్దకాలం తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Update: 2024-09-17 06:53 GMT

రాష్ట్రంలో దశాబ్దకాలం తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు కావస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రేవంత్ ‌పై, కాంగ్రెస్ పార్టీపై నిత్యం విమర్శలు చేస్తూ వస్తోంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలను ఎత్తిచూపుతున్నారు.

చాలా సందర్భాల్లోనూ ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా హైకమాండ్ పర్మిషన్ తప్పనిసరి అని.. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలన్నా అక్కడి నుంచి అనుమతి తీసుకోవాల్సిందే అంటూ మాట్లాడారు. దాంతో పాటే ఇక్కడ వసూలు చేసిన డబ్బులను ఢిల్లీ పెద్దలకు తరలిస్తున్నారంటూ చాలా సార్లు సంచలన కామెంట్స్ చేశారు.

రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. చాలా సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం పెద్దలను సైతం కలిశారు. మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన పలు సందర్భాల్లో భేటీ అయ్యారు. రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరారు. అయితే.. దీనిపైనా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. బీజేపీ, రేవంత్ ఒకటేనంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇక.. బీఆర్ఎస్ నేతల విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తానేమీ ఫామ్‌హౌస్ సీఎంను కాదంటూ బీఆర్ఎస్‌కు చురకలంటించారు. ‘ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం, కేంద్రానికి మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉంటాయి. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా. దానిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చోడానికి తానేమీ ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదని ప్రజాపాలన వేడుకల సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News