తెలంగాణ పథకాలు చూసి ఇక్కడ గెలిపించండి.. రేవంత్ కీలక ప్రెస్‌మీట్

నేడు ఢిల్లీ వేదికగా కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు.

Update: 2025-01-16 09:10 GMT

రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఏఐసీసీ ఇందిరా గాంధీ భవన్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం.. నేడు ఢిల్లీ వేదికగా కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు.

వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తాము ఇచ్చిన గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో రెండు హామీలను ఇచ్చింది. ప్రజలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలకు సంబంధించిన పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీకి నరేంద్ర మోడీ, కేజ్రీవాల్ ఏం చేశారని నిలదీశారు. వారిద్దరూ వేరువేరు కాదని, ఇద్దరూ ఒకటేనని విమర్శించారు.

దేశ ప్రధానిగా మూడో సారి పనిచేస్తున్న నరేంద్ర మోడీ.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేజ్రీవాల్ ఢిల్లీని ఏపాటి అభివృద్ధి చేశారని రేవంత్ ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన అభివృద్ధి అంతా కూడా గతంలో షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేనని స్పష్టం చేశారు. చంద్రమండలానికి రాకెట్లు పంపుతున్నట్లు చెబుతున్న మోడీ.. ఢిల్లీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని వెల్లడించారు. అందుకే ఈ సారి ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు.

Tags:    

Similar News