అబ్బో... రేవంత్ దూకుడు ఆపేలాగా క‌నిపించ‌ట్లే

ఇక ప్ర‌ధాని మోడీపై సైతం రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఎన్డీయే సర్కార్ వివక్ష చూపిస్తుందని విమర్శించారు.

Update: 2024-10-25 17:36 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయ‌డంలో ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ సంధించే మొద‌టి అస్త్రం ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ ఆలోచ‌న‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని పేర్కొన‌డం. బ‌డేభాయ్ పేరుతో పిలిచి ప్ర‌ధానికి ద‌గ్గ‌ర కావాల‌నే బిజీలో రేవంత్ ఉన్నార‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటుంది. అయితే, దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు క్లారిటీ, కౌంట‌ర్ ఇస్తుంటారు. తాజాగా ఇప్పుడు మ‌రోమారు త‌న‌కు క‌లిగిన భావ‌న‌ను ఆయ‌న నిర్మొహ‌మాటంగానే వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వ ప‌రంగా, పార్టీ ప‌రంగా బీజేపీని & ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని రేవంత్ ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు. త‌ను దూకుడుగా ముందుకు వెళ్తున్న మూసి ప్రాజెక్టు విష‌యంలో బీజేపీ అడ్డుప‌డ‌టంపై స్పందిస్తూ, మూసీ పునరుజ్జీవం చేస్తామంటే బీజేపీ నేతలు అడ్డుకుంటుండ‌టం వెనుక లెక్క‌లు వేరే ఉన్నాయ‌ని రేవంత్ పేర్కొన్నారు. తాము గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నాం కాబ‌ట్టే తెలంగాణను, హైదరాబాద్‌ను ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్న గుజరాత్ ఉదంతాన్ని బీజేపీ నేత‌లు ఎందుకు మ‌ర్చిపోయారని రేవంత్ ప్ర‌శ్నించారు. మూసీ అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డు పడుతున్నాయో అర్థం చేసుకోవాల‌ని వ్యాఖ్యానించారు.

ఇక ప్ర‌ధాని మోడీపై సైతం రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఎన్డీయే సర్కార్ వివక్ష చూపిస్తుందని విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పంపిస్తే కేంద్రం తిరిగి రాష్ట్రానికి 40 పైసలు మాత్రమే ఇస్తుంద‌ని, దక్షిణా రాష్ట్రాల పన్నులను ఉత్త‌రాది రాష్ట్రాల‌కు దోచిపెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఉత్తర, దక్షిణ భారతదేశం అనే విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టడం తప్పదేశానికి, ప్రజలకు చేసిందేమి లేద‌ని ఆరోపించారు. భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప మోడీ చేసిందేంటీ అంటూ విరుచుకుప‌డ్డారు.

కాగా, ఇటు నార్త్- సౌత్ రాష్ట్రాల‌తో పోలిక పెట్ట‌డం అటు పార్టీ ప‌రంగా కూడా బీజేపీని ఇర‌కాటంలో ప‌డేసేలా కామెంట్లు చేయ‌డం చూస్తుంటే... బీజేపీ విష‌యంలో ఇక త‌గ్గేది లేదు అన్న‌ట్లుగా ముందుకు పోవాల‌ని రేవంత్ భావించిన‌ట్లున్నార‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి విష‌యంలో ఒకింత సంయ‌మ‌నం పాటించాల‌ని వ్య‌వ‌హ‌రిస్తే, అది త‌న‌పై విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇస్తున్న నేప‌థ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకొని ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

Tags:    

Similar News