రేవంత్ వర్సెస్ చంద్రబాబు తొలి భేటీ.. ప్రజల ఆకాంక్ష ఇదేనా?
ఇదేసమయంలో ఆయన పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరూ.. చర్చించుకునేందుకు రెడీ అయ్యారు.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ గతంలోనూ జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతోంది. గతంలో రెండు సార్లు కేసీఆర్, జగన్ లు ఇళ్లలోనే భేటీ అయ్యారు. కానీ, ఇరు రాష్ట్రాల సమస్యలను వారు పరిష్కరించలేక పోయారు. ఇద్దరూ ఇగోలకు ప్రాధాన్యం ఇచ్చారు. పలితంగా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు ఎక్కడిగొంగళి అక్కడే అన్నట్టుగా గత పదేళ్లుగా ఉండిపోయాయి. అయితే.. తాజాగా తొలిసారి ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇదేసమయంలో ఆయన పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరూ.. చర్చించుకునేందుకు రెడీ అయ్యారు.
మరి ప్రజల ఆకాంక్ష ఏంటి?
గతంలో కేసీఆర్-జగన్‌ల మధ్య రెండు దఫాలు చర్చలు జరిగినప్పుడు లేని ఆకాంక్షలు ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ బలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. ముందుచూపున్న నాయకులుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, ప్రజలకు ఏది అవ సరమో గుర్తించే నాయకుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్ కావడం గమనార్హం. వీరిద్దరూ కూడా.. సమర్థవంతంగా సమస్యలపై దృష్టి పెడతారని ఎక్కువగానే అంచనాలు వున్నాయి. అయితే.. ఇది తొలి భేటీనేనని ఇరు వర్గాలు చెబుతున్నాయి. కానీ, తొలి భేటీలోనే కీలక సమస్యలను పరిష్కరించుకునేదిశగా అడుగులు పడాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఏంటి కారణం?
తొలి భేటీలోనే ఇరు రాష్ట్రాల సమస్యల్లో మెజారిటీ సమస్యలను పరిష్కరించాలని కోరుకోవడం వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. తొలి భేటీ తర్వాత.. ప్రతిపక్షాలు స్పందిస్తాయి. ఇదేసమయంలో తెలంగాణ సమాజం కూడా.. అనేక డిమాండ్లు, ఒత్తిడులు కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. మలి భేటీపై ఈ ప్రభావాలు పడే అవకాశం కనిపిస్తుంది. అలా కాకుండా.. మంచైనా.. చెడైనా.. తొలి భేటీలోనే తేల్చేసుకుంటే.. ప్రభావం పడినా.. పరిష్కరించుకునేందుకు సమయం ఉంటుంది. అంతేకాదు.. మలిభేటీకి.. రాజకీయ ఛాయలు కూడా కమ్ముకునే పరిస్థితి ఉంటుందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. ఇరు రాష్ట్రాలకు చెందిన ఆస్తుల విభజనతోపాటు.. విభజన చట్టంలోని కీలకమైన నీటి వనరుల వినియోగంపైనా దృష్టి పెట్టాలన్నది ప్రధాన సూచన. ముఖ్యంగా చంద్రబాబు తాజాగా ప్రకటించిన నదుల అనుసంధానంపై తెలంగాణను ఒప్పించే ప్రయత్నం చేయాలన్న మేలైన సూచన కూడా మేధావుల నుంచి వినిపిస్తోంది. ఇదే జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల జల రక్కసి సమస్య పరిష్కరించేందుకు ఎంతో వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. తొలి భేటీలోనే ఈ కీలక ప్రతిపాదనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.