రేవంత్ ఏపీ స్పీచ్ ఎలా ఉండబోతుంది?
కాగా ఫిబ్రవరి 25న తిరుపతిలో జరిగే ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వస్తారని చెబుతున్నారు.
దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణల్లో అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించింది. ఒకప్పుడు తమకు కంచుకోటలాంటి రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ చావుదెబ్బతింది. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఆ తర్వాత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటును కూడా గెలుచుకోని పార్టీగా అపప్రథను మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కోల్పోయిన తమ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు.
కాగా ఫిబ్రవరి 25న తిరుపతిలో జరిగే ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వస్తారని చెబుతున్నారు. ఇదే సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తొలిసారిగా ఆంధ్రాకు వస్తున్నారు. దీంతో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పీచ్ ఎలా ఉండబోతుందనేదానిపై ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం, పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ నిధుల విడుదల, రైల్వే జోన్ ను శరవేగంగా ఏర్పాటు చేయడం, విభజన సందర్భంగా ఇచ్చిన ఇతర హామీలన్నింటిని అమలు చేస్తామని చెబుతోంది. కాంగ్రెస్ నేతలంతా ఇదే విషయాన్ని చెబుతూ ప్రచారాన్ని చేస్తున్నారు.
కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని తన ప్రసంగంలో చెప్పొచ్చని చెబుతున్నారు. తెలంగాణలో అధికారాన్ని ఇచ్చినట్టే ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వాలని కోరతారని టాక్ నడుస్తోంది.
విభజన హామీల అమలుతోపాటు తెలంగాణలో మాదిరిగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు తదితర పథకాలను ఇక్కడ కూడా రేవంత్ ప్రకటించవచ్చని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏపీలో గెలిపిస్తే తెలంగాణ, కర్ణాటకలో మాదిరిగా సంక్షేమ పథకాలను తమ పార్టీ అమలు చేస్తుందని రేవంత్ ప్రజలకు భరోసా ఇస్తారని పేర్కొంటున్నారు.
కేవలం ఒక్క తిరుపతి సభకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభల్లో రేవంత్ పాల్గొంటారని చెబుతున్నారు. తెలంగాణలో మాదిరిగా ఆంధ్రాలోనూ రేవంత్ ను అభిమానించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు గణనీయంగా మేలు చేకూరుతుందని భావిస్తున్నారు.