తెలంగాణకు కొత్త ట్యాగ్ ఇచ్చిన సీఎం రేవంత్

ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి.. పదేళ్ల టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు.

Update: 2024-08-09 06:26 GMT

ఎన్ని అదిరే ఫీచర్స్ ఉన్న అద్భుతమైన కారు అయినప్పటికి బండిని స్టార్ట్ చేసినప్పుడు జీరోతోనే మొదలవుతుంది. బండి సామర్థ్యానికి తగ్గట్లు.. క్షణాల వ్యవధిలో వేగాన్ని పుంజుకుంటుంది. అదిరే వాహనం బాగుంటేనే సరిపోదు. దాన్ని డ్రైవ్ చేసే డ్రైవర్ సామర్థ్యం కూడా అవసరమే. డెవలప్ మెంట్ లో దూసుకెళుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి.. పదేళ్ల టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తన ఆశల్ని.. ఆకాంక్షల్ని షేర్ చేసుకుంటున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రానికి కొత్త లక్ష్యం గురించి చెప్పటమే కాదు.. సరికొత్త ట్యాగ్ లైన్ గురించి చెప్పుకొచ్చారు. ఆసక్తికరంగా మారిన ఈ అంశాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.

సీఎం రేవంత్ మాటల్ని చూస్తే.. ఆయన అమెరికా పర్యటనలో ఆయనలో కొత్త ఆలోచనల్ని తీసుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. తనకొచ్చిన ఆలోచనల్ని వెంటనే కార్యరూపం దాల్చేలా వ్యవహరిస్తున్న ఆయన వేగం తెలంగాణకు మేలు చేస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి అంశాలు రేవంత్ మాటల్లో వినిపిస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే.. ‘‘‘ఇప్పటి వరకు మేం న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్యాన్ని.. నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్.. అని పిలుద్దాం..’ అని సీఎం ప్రకటించారు.

ఈ సందర్భంగా తెలంగాణ కొత్త లక్ష్యం గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘రాబోయే దశాబ్దంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలి’’ అంటూ తన స్వప్నాన్ని ఆవిష్కరించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖుల్ని కలుస్తున్న ఆయన ఇంకేం వ్యాఖ్యలు చేశారన్నది చూస్తే..

- ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దాం.

- హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కు పర్యాయపదంగా నిలుస్తుంది.

- ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలి. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం.

- ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాలుగో నగరంగా ‘‘ఫ్యూచర్ సిటీ’’ని తయారు చేసుకుంటున్నాం.

- హైదరాబాద్లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News