మంత్రుల సిబ్బందిపై.. రేవంత్ డేగకన్ను.. రీజనేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తన ప్రమాణ స్వీకారం రోజునే 11 మందిని మంత్రులుగా తీసుకు న్నారు. వీరిలో ఒకరు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాగా.. మిగిలిన వారు మంత్రులు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తన ప్రమాణ స్వీకారం రోజునే 11 మందిని మంత్రులుగా తీసుకు న్నారు. వీరిలో ఒకరు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాగా.. మిగిలిన వారు మంత్రులు. అయితే.. శాఖలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో మంత్రులకు చేతి నిండా పని ఉంటుంది. దీంతో ఎక్కువ మందిని సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి సంబంధించిన నియామకాలు కూడా జరుగుతున్నాయి. అయితే వీరినేమీ బయట నుంచి నియమించుకోరు.
ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులనే వారి వారి స్థాయి, అనుభవాలను బట్టి.. తమ తమ శాఖల్లో నియమించు కుంటారు. అయితే.. ఇలాంటి సందర్భంలో గత ప్రబుత్వాల్లో పనిచేసిన వారికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే.. వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి తమ పని సులువు అవుతుందని కొత్త మంత్రులు భావిస్తారు. తర్వాత.. నెమ్మది నెమ్మదిగా వారు శాఖపై పట్టు పెంచుకుని.. కొత్తవారికి అవకాశం ఇస్తారు.
అయితే.. తాజాగా రేవంత్ రెడ్డి మాత్రం.. పాతవారికి చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మంత్రులు తమ తమ శాఖ పరిధిలో నియమించుకునే పీఏలు, ఓఎస్‌డీలు, సెక్రటరీలు ఇలా .. అన్ని విభాల వారి విషయంపైనా డేగకన్ను సారించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. గత ప్రభుత్వంలో పనిచేసిన వారిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులుగా కూడా అప్పట్లో వారిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో అలాంటి వారికి అవకాశం ఇస్తే.. తమ సర్కారుపైనా ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని భావించిన రేవంత్‌రెడ్డి.. మంత్రులు చేసుకునే నియామకాలపైఒక కన్నేసి ఉంచారని.. గత ప్రభుత్వం లో పనిచేసిన వారిని కనీసం శాఖల ఛాయలకు కూడా రాకుండా చూడాలని బావిస్తున్నారని తెలుస్తోంది. పైగా.. వారిపై వచ్చిన అవినీతి, ఇతర ఆరోపణలకు సంబంధించి విచారణ కూడా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.