కేరళలో రేవంత్ చెప్పిన రెండు పరివార్ లు ఏమంటే?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Update: 2024-04-19 04:33 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దక్షిణాదికి చెందిన ఒక నేత ఉత్తరాదిన ప్రముఖంగా ఉండే టీవీ చానల్ కార్యక్రమానికి వెళ్లటం.. తన మాటలతో వారిని ఆకట్టుకోవటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ విషయంలో ఇటీవల కాలంలో ఇద్దరు నేతలు తెర మీదకు రావటం.. వారి నోటి నుంచి వచ్చిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటమే కాదు.. కొత్త తరానికి ప్రతినిధులుగా వారిని అభివర్ణిస్తున్నారు.

ఇందులో మొదట చెప్పాల్సింది హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవీలత అయితే.. ఇంకొకరు తన నోటి మాటలతో.. లెక్కలతో అందరిని ఆకట్టుకోవటమే కాదు మోడీ అండ్ కో మాటలకు భారీగా పంచ్ వేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగా చెప్పాలి. బీజేపీ పెట్టుకున్న 400 స్థానాల్లో గెలుపు సాధ్యమే కాదన్న విషయాన్ని అంకెలతో సహా ఫ్రూవ్ చేయటమే కాదు.. ఆ లక్ష్యానికి చేరుకోవాలంటే పాకిస్థాన్ లోనూ బీజేపీ పోటీ చేయాలన్న పంచ్ పలువురిని ఆకట్టుకుంది.

ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతల్లో ఇంత వాడిగా.. వేడిగా వాదనలు వినిపించిన అధినేత లేదన్న మాట వినిపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా కేరళలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ నోట మరో ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. దేశంలో రెండు పరివార్ ల మధ్య పోరాటం జరుగుతుందన్న ఆయన.. తనదైన రీతిలో మోడీ అండ్ కోకు పంచ్ విసిరారు. ‘‘మోడీ పరివార్ లో ఈడీ.. ఈవీఎంలు.. సీబీఐ.. ఐటీ.. అదానీ.. అంబానీ ఉన్నారు. అదే ఇండియా పరివార్ లో సోనియా గాంధీ.. రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీతో పాటు వయనాడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇందిరా.. రాజీవ్ లు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే.. సోనియా.. రాహుల్ ప్రధాని పదవిని త్యాగం చేశారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఓవైపు కాంగ్రెస్ సొంతంగా యాభై సీట్లను కూడా దాటలేని కొన్ని రాజకీయ పక్షాలు వాదనలు వినిపిస్తుంటే.. ఇండియా కూటమికి 150 సీట్ల కంటే తక్కువకే పరిమితం అవుతారన్న విశ్లేషణలకు భిన్నంగా రేవంత్ మాటలు ఉంటున్నాయి. జూన్ 9న రాహుల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని నమ్మకంగా చెబుతున్నారు. అంతేకాదు.. వయనాడ్ ప్రజలు ఓటేసేది ఒక ఎంపీకి కాదని.. దేశానికి కాబోయే ప్రధానమంత్రికి అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News