గొర్రెలు మెక్కిన 700 కోట్లు విచార‌ణ చేద్దామా? : బీఆర్ ఎస్‌కు రేవంత్ స‌వాల్‌

''గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో ఏ గొర్రెలు 700 కోట్లు మెక్కాయో!'' అని రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు.. తీవ్ర దుమారం రేపాయి.

Update: 2024-07-27 10:19 GMT

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శనివారం.. అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాడి వేడి చ‌ర్చ సాగింది. ఈ క్ర‌మంలో గ‌త బీఆర్ ఎస్ స‌ర్కారు అన్ని విధాలా రాష్ట్రంలో అవినీతికి పాల్ప‌డింద‌ని.. సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌తి ప‌థ‌కంలోనూ అవినీతి రాజ్య‌మేలింద‌ని.. ముడుపులు ద‌క్కించుకున్నార‌ని విమ ర్శించారు. ''గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో ఏ గొర్రెలు 700 కోట్లు మెక్కాయో!'' అని రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు.. తీవ్ర దుమారం రేపాయి.

ఈ 700 కోట్ల గొర్రెల అవినీతిపై విచార‌ణ చేయిస్తామ‌ని.. దీనికి బీఆర్ ఎస్ సిద్ధ‌మేనా? అని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. విలువైన ఆస్తుల‌ను కూడా.. సంత‌లో కూర‌గాయ‌లు అమ్మిన‌ట్టు అమ్మేశార‌ని దుయ్య‌బట్టా రు. ల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌ల విలువైన ఓఆర్ ఆర్‌ను 7 వేల కోట్ల రూపాయ‌ల‌కు అమ్మి.. దానినే గొప్ప‌గా చెప్పు కొంటున్నార‌ని అన్నారు. రంగారెడ్డి భూముల‌ను కూడా కారు చౌక‌గా అమ్ముకున్నార‌ని.. దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోలేద‌ని రేవంత్ వ్యాఖ్యానించారు.

బ‌తుక‌మ్మ పేరుతో చీర‌లు పంపిణీ చేశార‌ని చెప్పిన రేవంత్.. సిరిసిల్ల నేత‌న్న‌ల‌కు కోట్ల రూపాయ‌ల బ‌కాయిలు పెట్టి.. వారి జీవితాల‌ను అగాథంలోకి నెట్టార‌ని అన్నారు. ఆ సొమ్మును తాము ఇచ్చి వారిని ఆదుకున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా గుజ‌రాత్‌లోని సూర‌త్ నుంచి కూడా కిలోల లెక్క‌న చీర‌లు తెచ్చి.. తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల‌కు నాశిర‌కం చీర‌లు అంట‌గట్టిన విష‌యాలు అంద‌రికీ తెలిస‌నేవ‌న‌ని అన్నారు. గొర్రెల పేరుతో 700 కోట్లు తిన్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ అన్ని వ్య‌వ‌హారాల‌పైనా విచార‌ణ‌కు తాము సిద్ధ‌మ‌ని.. బీఆర్ ఎస్ నాయ‌కులు సిద్ధ‌మేనా? అని ప్ర‌శ్నించారు.

అప్పులే కాదు.. ఆస్తులు చూడండి: హ‌రీష్ రావు

తెలంగాణ‌లో ప‌దేళ్ల కాలంలో 7 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేశారంటూ బీఆర్ ఎస్ స‌ర్కారుపై రేవంత్‌రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌ను మాజీ మంత్రి హ‌రీష్ రావు ఖండించారు. అప్పులు చేశామ‌ని చెబుతున్న రేవంత్.. ఆ స‌మ‌యంలో కూడ‌బెట్టిన ప్ర‌జ‌ల ఆస్తుల‌ను కూడా గ‌మ‌నించాల‌న్నారు. అనేక ప్రాజెక్టులు క‌ట్టామ‌ని.. అవి ప్ర‌జ‌ల ఆస్తికాదా? అని ప్ర‌శ్నించారు. అప్పులు చెబుతున్న‌వారు.. ఆస్తుల వివ‌రాలు కూడా వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News