జగన్ కూడా ఇలాగే మాట్లాడితే 11 వచ్చాయ్ రేవంత్ !
రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఒకలా విపక్షంలో ఉంటే మరోలా ఉంటారు.
రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఒకలా విపక్షంలో ఉంటే మరోలా ఉంటారు. అది అధికారం మహిమగా ఉంటుంది. ఏపీలో జగన్ సీఎం గా ఉన్నపుడు విపక్షాన్ని లైట్ తీసుకున్నారు. ఫలితంగా 11 నంబర్ కి ఆయన పడిపోయారు. ఘోరమైన ఓటమిని చవిచూసారు. ఇక తెలంగాణాలో చూస్తే బీఆర్ఎస్ ఓడింది కానీ దారుణమైనది మాత్రం కాదు, పైగా కేసీఆర్ చంద్రబాబు మాదిరిగానే రాజకీయ వ్యూహకర్త. ఆయన బుర్రలో ఒకేసారి వేయి సినిమాలు ఆడిస్తారు అని పేరు.
అయితే కేసీఆర్ ని ఓడించామని అతి ధీమాతో తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నారు అని అంటున్నారు. ఆయన ఈ వీర లెవెల్ నమ్మకంతో కేసీఆర్ ని పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఢిల్లీ టూర్ లో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడిన మాటలే ఇపుడు చర్చకు దారి తీస్తున్నాయి.
అసలు తెలంగాణాలో బీఆర్ఎస్ ఎక్కడ ఉంది అని రేవంత్ రెడ్డి మీడియా ముఖంగానే ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ కి గత చరిత్ర ఘనంగా ఉంది కానీ భవిష్యత్తు అసలు లేనే లేదు అని రేవంత్ రెడ్డి తనదైన జోస్యం వినిపిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవలేని దీనావస్థలో ఉందని కూడా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అయితే ఇక్కడే ఆయనను జగన్ తో పోల్చాలని అంటున్నారు. జగన్ కూడా అధికారం అండ చూసుకుని చంద్రబాబు మనకు పోటీయే కాదు నథింగ్ అని పార్టీ నేతలతో అన్నట్లుగా ప్రచారంలో ఉంది. అలా పదే పదే టీడీపీని చులకన చేసి మాట్లాడడం ద్వారా వైసీపీ తన ఓట్లూ సీట్లు తగ్గించేసుకుని దారుణంగా ఓడింది. కసి పుట్టి టీడీపీ గ్రాఫ్ పెంచుకుని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది.
ఇది ఏపీలో తాజాగా జరిగిన రాజకీయ కధ. మరి దీనిని చూసిన మీదట అయినా రేవంత్ రెడ్డి లాంటి వారు ఆలోచించాలి కదా అని అంటున్నారు. ఎదుటి పక్షాన్ని తూలనాడితే ఓట్లు పెరగవని రేవంత్ గ్రహించాలని అంటున్నారు. కాంగ్రెస్ కి తెలంగాణాలో తాజా ఎంపీ ఎన్నికల్లో వచ్చినవి జస్ట్ ఎనిమిది ఎంపీ సీట్లే. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఊపు అలాగే కొనసాగితే 12 ఎంపీ సీట్లు రావాలి కదా అని అంటున్నారు మరి ఎనిమిదికి ఎందుకు తగ్గింది అని ప్రశ్నిస్తున్నారు.
దీనినే రేవంత్ రెడ్డి అర్ధం చేసుకోవాలని అంటున్నారు అంతే కాదు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం అన్ని జిల్లాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ పార్టీ నిలబెట్టిన తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓటింగుతో గెలవలేదు అని గుర్తు చేస్తున్నారు. సెకండ్ ప్రయారిటీ ఓట్లను కలుపుకుని బొటా బొటీ మెజారిటీతో గెలిచారు అని గుర్తు చేస్తున్నారు.
ఇదే సీఎన్ ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగితే జగన్ సజ్జల వంటి వారు ఆ ఓట్లు తమ పార్టీకి చెందినవి కావు అనేశారు. దీంతో తెలంగాణాలో ఇపుడు చర్చ సాగుతోంది గతంలో ఎలా ఉండేది ఇపుడు ఎలా ఉంది అని. ఏది ఏమైనా అధికారంలో ఉన్నపుడు నీటిలో మొసలి మాదిరిగా బలం గట్టిగా ఉంటుంది. అలా కనిపిస్తుంది కూడా.
కానీ ఆ అధికారం అయిదేళ్ళు మాత్రమే ఉంటుంది, ఈ మధ్యకాలంలో ప్రజల ఆలోచనలు మారుతాయి. ఏ చిన్న సంఘటన జరిగినా అధికారంలో ఉన్న ప్రభుత్వం మీదనే ప్రభావం చూపిస్తుంది. అంతే కాదు విపక్షం అవుట్ అని అనుకుంటే వారు అమాంతం త్రివిక్రమావతారం ఎత్తేసి కనిపిస్తారు.
దీనిని భారత దేశంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల విపక్షాన్ని లైట్ తీసుకోకూడదు అలాగే తమను తాము అతిగా ఊహించుకోకూడదు, నథింగ్ అని విపక్షాన్ని అన్నా ఎక్కడ వారు ఉన్నారు అని ఎగగాళీ చేసినా నష్టం ఎపుడూ అధికార పక్షానికే. ఎందుకంటే అసలైన ప్రతిపక్షం గా ప్రజలు ఉంటారు. వారు ఇలాంటివి ఎప్పటికప్పుడు గమనిస్తూంటారు. మితిమీరిన విశ్వాసాన్ని మొగ్గలోనే తుంచేస్తూంటారు. సో పాలకులు ఎవరైనా తస్మాత్ జాగ్రత్త అన్నదే జనం ఇచ్చే సందేశం.