ఆలూ లేదు .. చూలూ లేదు .. అప్పుడే మంత్రి పదవి!

కోమటిరెడ్డి కుటుంబం ఎంపీ టికెట్ ఆశించగా వారిని కాదని తన సన్నిహితుడు చామలకు టికెట్ ఇప్పించుకున్నాడు రేవంత్

Update: 2024-04-24 01:30 GMT

కాంగ్రెస్ పార్టీలో పదువులు రావాలంటే అధిష్టానం ఆశీస్సులు ఉండాలి. వాళ్లు ఎవరికి హామీ ఇస్తారో ? ఎవరికి టికెట్లు ఖరారు చేస్తారో ? దాని వెనక ఎవరి హస్తం ఉంటుందో ఏడు దశాబ్దాలు దాటినా ఏ కాంగ్రెస్ నేతకు అర్ధం కాని పరిస్థితి. సీల్డ్ కవర్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. అయితే ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టి అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే ముదిరాజ్ ఎమ్మెల్యే శ్రీహరిని, భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవులు గ్యారంటీ అని ప్రకటించారు.

కోమటిరెడ్డి కుటుంబం ఎంపీ టికెట్ ఆశించగా వారిని కాదని తన సన్నిహితుడు చామలకు టికెట్ ఇప్పించుకున్నాడు రేవంత్. ఈ నేపథ్యంలో తన మీద గుర్రుగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి సమీక్ష నిర్వహించి చామలను గెలిపిస్తే మంత్రి పదవి గ్యారంటీ అని హామీ ఇచ్చాడు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు పదవి కావాలంటే అడుక్కోనని, లాక్కుంటాను అంటూ పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ మాదిరిగా డైలాగులు విసురుతున్నాడు. ఇక పాలమూరు పర్యటనలో ముదిరాజ్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి విషయంలో రేవంత్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓసీలకు మాత్రం అధిష్టానం పిలిచి మంత్రి పదవులు ఇస్తుంది. బీసీలకు మాత్రం కండీషన్లు పెట్టి పదవులు ఇస్తారా ? ఇదేం రాజకీయం అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇక ఈ విషయం ఇలా ఉంటే నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో జీవన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రిగా చేసే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చానీయాంశంగా మారింది. ఆలూ లేదు .. చూలు లేదు .. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఎన్నికలలో గెలుపు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆశీస్సులు లేనిది పదవులు రావడం అసాధ్యం. అక్కడ ఎవరి ఆశీస్సులు ఎవరికి ఉంటాయో ? ఎవరికీ తెలియదు. ఖమ్మం, కరీంనగర్ లోక్ సభ అభ్యర్థుల ఖరారు అంశాన్నే ఎటూ తేల్చలేక అధిష్టానానికి వదిలేసిన రేవంత్ రెడ్డి మంత్రి పదవులకు హామీలు ఇవ్వడం చూసి కాంగ్రెస్ వర్గాలు నవ్వుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్లే రేవంత్ మాట వినరు. ఇక అధిష్టానం ఏం వింటుంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News