రేవంత్ మేనేజ్మెంట్ కోటా ముఖ్యమంత్రి అంట!
త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో బీఆరెస్స్ దూకుడు పెంచుతుంది
త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో బీఆరెస్స్ దూకుడు పెంచుతుంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బను మరిచిపోయేలా సత్తా చాటాలని భావిస్తుంది. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ రావులు మొన్న పార్లమెంట్ సెగ్మెంట్లు, ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలనుం నేతలనూ కలుస్తూ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు.
ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, సమన్వయ లోపాలూ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తున్న బీఆరెస్స్ అధిష్టాణం... ఇదే క్రమంలో కాంగ్రెస్, బీజేపీలపై అస్త్రాలు సంధిస్తూ, వ్యూహాలు అమలుపరుస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో త్వరలో కేసీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ ఫుల్ టైం రంగంలోకి దిగబోతున్నారని అంటున్నారు.
ఈ సమయంలో... రోజుకో అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున సమీక్షలు చేస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్, హరీష్ లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మెదక్ లో మాజీ మంత్రి హరీష్ రావు.. సిరిసిల్ల నియోజకవర్గంలోని సమావేశంలో కేటీఆర్ పాల్గొని కేడర్ కు దిశానిర్దేశం చేస్తూ.. గ్యాప్ లో కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో సీఎం రేవంత్ పై సంచనల ఆరోపణలు చేశారు కేటీఆర్.
అవును... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారో ఏమో కానీ... అవకాశం వచ్చిన ప్రతీసారి రేవంత్ పై నిప్పులు చెరుగుతున్నారు కేటీఆర్. ఇందులో భాగంగా... అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడుతాయని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై నేరుగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఇందులో భాగంగా... రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని.. ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని.. మాణిక్ రావు ఠాగూర్ కి రూ.50కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి బీఆరెస్స్ ను తొక్కేయాలని చూస్తున్నాయని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని తెలిపారు. ఈ క్రమంలో ముందుగా.. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.