డీఎస్సీ : రేవంత్ మెడకు చుట్టుకోవడం ఖాయమేనా ?

ఇక ఆ వెంటనే డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టులు పెంచి మెగా డీఎస్సీ వేయాలని నిరుద్యోగులు భారీ నిరసన చేపట్టారు

Update: 2024-07-10 07:30 GMT

తెలంగాణ నిరుద్యోగుల సమస్య నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల అండతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు తిరగకుండానే బద్దశతృవులా మారిపోయింది. గ్రూప్ 1,2,3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ మోతాలాల్ నాయక్ అనే నిరుద్యోగి 9 రోజులు నిరాహార దీక్ష చేపట్టడంతో మొన్నటి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో అతడి దీక్ష విరమించాడు.

ఇక ఆ వెంటనే డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టులు పెంచి మెగా డీఎస్సీ వేయాలని నిరుద్యోగులు భారీ నిరసన చేపట్టారు. డీఎస్సీకి, గ్రూప్‌ 2 పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉన్నందుకు ప్రభుత్వం డీఎస్సీ వాయిదా వేయాలన్నది అభ్యర్థుల ఆందోళన.

అయితే ఈ నిరసనల వెనక కోచింగ్ సెంటర్ల యజమానుల కుట్ర ఉందని, వాయిదా వేస్తే శిక్షణల పేరుతో ఒక్కొక్క సెంటర్ రూ.100 కోట్లు ఆర్జిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీంతో డీఎస్సీ వాయిదా కోసం పట్టుబడుతున్న వారు సోషల్ మీడియాలో ఆందోళనకర వీడియోలను విడుదల చేస్తున్నారు.

డీఎస్సీ వాయిదా వేయాలన్న మా డిమాండ్ వెనక ఎవరూ లేరని, మేము స్వచ్చంధంగా చేస్తున్న డిమాండ్ అని, డీఎస్సీకి కేవలం 20 రోజుల సమయమే ఉందని, తాము 6వ తరగతి నుండి ఇంటర్ వరకు పుస్తకాలు చదవాల్సి ఉన్నందున మా మీద తీవ్ర వత్తిడి ఉందని, ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకున్నామని, సమయాభావం మూలంగా ఉద్యోగం రాకుంటే ఆత్మహత్యలే శరణ్యం అని, మాకు చదువుకోవడానికి సమయం ఇవ్వాలని అభ్యర్థులు వీడియోలు విడుదల చేస్తున్నారు. దీంతో నిరాశలో ఉన్న ఆ అభ్యర్థుల వివరాలు తెలుసుకుని వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఓదార్చుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఏ మాత్రం వత్తిడికి లోనై ఏమైనా చేసుకుంటే ప్రభుత్వం మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News