హైదరాబాద్‌ను చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ డెవలప్ చేశారు
ఈ రోజు నానక్‌రాం గూడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను మాజీ సీఎంలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు ఎంతో డెవలప్ చేశారని కొనియాడారు.
రాజకీయం అంటే.. ఇదే! నిన్నటి వరకు.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. తాజాగా ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. అసెంబ్లీ వేదికగా.. కేసీఆర్ పాలనను తూర్పారబట్టిన రేవంత్ ఈ రోజు నానక్‌రాం గూడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను మాజీ సీఎంలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు ఎంతో డెవలప్ చేశారని కొనియాడారు. నానక్ రామ్ గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందన్నారు. అందుకే హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా మారిందని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే.. మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల కృషి ఎంతో ఉందన్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా హైదరాబాద్‌ను అభివృద్ది చేశారని చెప్పారు.
ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందన్నారు. నగరంలో శాంతి భద్రతలు సరైన విధంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్న ఆయన హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని తెలిపారు. గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని, త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తామని వెల్లడించారు.
అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని 25వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మెట్రో రద్దు కాలేదని వెల్లడించారు. "ఫార్మా సిటీలు కాదు.. ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తాం" అని రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్నారు. అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకెళతామని పేర్కొన్నారు.