RRR : రాహుల్, రేవంత్, రియల్ ఎస్టేట్

తెలంగాణలో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అంటూ ప్రజాప్రతినిధుల నుండి ప్రధానమంత్రి మోడీ వరకు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు

Update: 2024-05-03 05:08 GMT

తెలంగాణలో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అంటూ ప్రజాప్రతినిధుల నుండి ప్రధానమంత్రి మోడీ వరకు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. మరి ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అని చెబుతున్న మోడీ దానిపై ఈడీ, ఐటీలను ఎందుకు ప్రయోగించడంలేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ అవగాహన మూలంగానే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

RRR అంటే R - రాహుల్, R - రేవంత్, R - రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ హైదరాబాద్ ను సెటిల్మెంట్ బ్రాండ్ గా మార్చాడని, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ భవన నిర్మాణరంగంలో బిల్డర్ల నుండి వసూళ్లకు తెరలేపాడని మహేశ్వర్ రెడ్డి విమర్శించాడు. అధికారంలోకి వచ్చిన మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు.

వసూళ్లకు భయపడి రాష్ట్రానికి నిర్మాణ కంపెనీలు రావడం లేదని, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ కు రశీదులు, చెక్కులు ఉండవని, క్యాష్ అండ్ క్యారీకి రేవంత్ తెరలేపాడని, బిల్లులు లేని ఈ దందాలో వేల కోట్ల అవినీతి జరుగుతుందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. చదరపు అడుగుకు రూ.68 చొప్పున ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ తీసుకుంటున్నది నిజం కాదా ? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లు వసూలు చేశారని, ఎన్నికల కోసమే వీటిని వినియోగిస్తున్నారని, మరో మూడు రోజులలో మరో అవినీతిని బయటపెడతానని అన్నారు.

Tags:    

Similar News