డిసెంబరు9తో రేవంత్ కున్న సెంటిమెంట్?
తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ నవంబరు 30న జరుగుతుంటే.. ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న జరగనుంది
ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ మీదా.. ఆయన ప్రభుత్వం మీద ఒక్కడై విరుచుకుపడుతున్నారు. వారు చేస్తునన ప్రచారాల్ని తిప్పి కొడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు విపరీతంగా శ్రమిస్తున్నాడు. అలాంటి రేవంత్ తాజాగా ఒక ప్రముఖ మీడియా అధినేతతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన బోలెడన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చారు.
తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ నవంబరు 30న జరుగుతుంటే.. ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న జరగనుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్ఛితంగా గెలుస్తుందన్న నమ్మకం ఉన్న రేవంత్.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి 9న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు చెప్పారు. మీరే .. కాబోయే ముఖ్యమంత్రా? అని అడిగితే తనకు అలాంటి మాట ఏదీ అధిష్ఠానం చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కీలకమైన వ్యాఖ్య వచ్చింది. ఒకవేళ ఆ విషయాన్ని తనతో చెప్పినా.. తాను బయటకు చెప్పనంటూ నర్మగర్భంగా మాట్లాడారు.
డిసెంబరు 9న ప్రమాణస్వీకారం అని చెప్పటానికి కారణమేంటి? అన్నప్రశ్నకు.. ఆ డేట్ తో తనకున్న భావోద్వేగ సంబంధాన్ని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ ఉందన్న రేవంత్.. '2004 ఉచిత విద్యుత్తు.. విద్యుత్ బకాయిల మాఫీ మీద వైఎస్ మొదటి సంతకం పెట్టింది అక్కడే. ఆరు గ్యాంరెటీలపై కూడా అక్కడే సంతకం చేయాలని అనుకున్నాం' అని చెప్పుకొచ్చారు. గత ఏడాది సెప్టెంబరు 17నే తాము డిసెంబరు 9న ప్రమాణస్వీకారం చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
కాలం కూడా తాను అనుకున్నట్లే నడుస్తుందన్న రేవంత్.. ''2009 డిసెంబరు 9న చిదంబరం నుంచి మొట్టమొదటి తెలంగాణ ప్రకటన వచ్చింది. ఆరోజు సోనియా జన్మదినం'' అని చెప్పారు. తాను కూడా డిసెంబరు 9న కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పిన రేవంత్.. ''నేను అక్టోబరు 31న కాంగ్రెస్ లో చేరా. డిసెంబరు 9న గాంధీ భవన్ లోకి అడుగు పెట్టా'' అని అన్నారు. తనకు సెంటిమెంట్ వాల్యూ ఉందని.. అందుకే డిసెంబరు 9 తనకు స్పెషల్ డే అని చెప్పుకొచ్చారు. మరి.. రేవంత్ చెప్పినట్లు జరుగుతుందా? అన్న దానికి డిసెంబరు 3 వరకు వెయిట్ చేయక తప్పదు.