రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తారా...!?
అన్నింటి కంటే ఎక్కువగా బీఆర్ఎస్ ని కట్టడి చేయడంలో ఎక్కడికక్కడ బ్రేకులు వేయడంలో రేవంత్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ నే వాడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు ఇపుడు ఆక్సిజన్ తెలంగాణావే. తెలంగాణాలో దశాబ్దం తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇపుడు మంచి ఊపులో ఉంది. డైనమిక్ లీడర్ గా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రెండు నెలల పాలన పట్ల పూర్తిగా పాజిటివిటీ కనిపిస్తోంది. అన్నింటి కంటే ఎక్కువగా బీఆర్ఎస్ ని కట్టడి చేయడంలో ఎక్కడికక్కడ బ్రేకులు వేయడంలో రేవంత్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ నే వాడుతున్నారు.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఆశలు అన్నీ తెలంగాణా మీదనే ఉన్నాయి. కాంగ్రెస్ కి ఈసారి సౌత్ అతి పెద్ద అండ కాబోతోంది. కేరళ కర్నాటక తెలంగాణాల నుంచి ఎంపీ సీట్లు సొంతంగా గెలుచుకోవాలని చూస్తోంది. తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఉంది. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పవర్ లో ఉండడంతో ఆ ప్రభావం ఎంతో కొంత అయినా పడి ఏపీలో కూడా కాంగ్రెస్ లేస్తుందేమో అన్న ఆశలు ఉన్నాయి.
ఇంకో వైపు చూస్తే వైఎస్సార్ తనయ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. దాంతో వైఎస్సార్ లెగసీ ఇటు వైపు ఎంతో కొంత టర్న్ అవుతుంది అన్నది ఒక ఆశ. ఇపుడు ఏపీకి కావాల్సిన ఇంధనం ధనం అన్నీ కూడా తెలంగాణా నుంచే రావాలి. ఇమేజ్ ఉన్న లీడర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణాలో కూడా లోక్ సభ ఎన్నికలు ఉన్నా ఏపీలో లోక్ సభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి.
దాంతో ఏపీ విషయంలో కాంగ్రెస్ పెద్దలు రేవంత్ మీద కీలక బాధ్యతలు పెడతారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా జనవరి 21న బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల రెండు దఫాలుగా ఏపీలోని అనేక జిల్లాల్లో కలియతిరిగారు. ఆమె తాజాగా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం కీలక పరిణామంగా చూస్తున్నారు.
ఒకే పార్టీ కాబట్టి ఈ కలయికలో ఏ విశేషం లేదు అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ లో రేవంత్ ని షర్మిల తీవ్రంగా ఒకనాడు వ్యతిరేకించారు. ఆయన తప్ప ఎవరూ సీఎం అయినా ఓకే అని కొన్ని పేర్లు చెప్పారు. ఇపుడు ఆమె టోన్ మారింది. ఇటీవల తన కుమారుడి నిశ్చితార్ధం ఇన్విటేషన్ ని రేవంత్ రెడ్డిని కలసి ఇచ్చిన షర్మిల ఇపుడు మరో విడత ఆయనను కలవడం మాత్రం ఆసక్తికరమే అని అంటున్నారు
ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ రెండు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. ఆ విషయాన్ని షర్మిల వెల్లడించారు. హై కమాండ్ ఆదేశాలతో కూడా షర్మిల కలసి ఉండవచ్చు అని అంటున్నారు. రేపటి రోజున ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడానికి కూడా ఇది వీలు పడేలా ఉంటుందని అంటున్నారు.
ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఎవరికి మేలు ఎవరికి చేటు అన్నది కూడా మరో చర్చగా ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా ఆయన ఎక్కువగా చంద్రబాబుకు సన్నిహితుడు, టీడీపీ నేతగానే చూసే వారు ఉంటారు. ఏపీలో టీడీపీ ప్రత్యర్థిగా ఉన్న వేళ రేవంత్ రెడ్డి ఆ పార్టీని గట్టిగా విమర్శిస్తారా అన్నది కూడా ఒక చర్చ.
ఏది ఏమైనా షర్మిల మాదిరిగానే నూటికి తొంబై శాతం పైగా వైసీపీకి విమర్శిస్తూ ఒక పది శాతం టీడీపీని విమర్శించేలా రేవంత్ రెడ్డి వ్యవహరించవచ్చు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే కనుక కాంగ్రెస్ గ్రాఫ్ ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఆర్ధికంగా హంగులు కూడా తెలంగాణావే ఏపీకి సమకూర్చాల్సి ఉంటుంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో రేవంత్ షర్మిల ఇద్దరూ జోడీతో రేపటి రాజకీయాన్ని చేసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంది అని అంటున్నారు.