రేవంత్ లెక్కలే వేరు !
అందుకే అధికారం చేతిలో ఉందన్న భావనతో అహంభావానికి పోతే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం గులాబీ నేతలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లుగా ఉంది.
అధికారం శాశ్వతం కాదు. అంతా ప్రజల చేతుల్లో ఉంది. వారు ఏది డిసైడ్ చేస్తే అదే శాసనం. వారు తలచుకుంటే అప్పటివరకు మకుటం లేని మహరాజుల మాదిరి వెలిగిపోయిన వారంతా ఎవరూ పట్టించుకోని పరిస్థితులకు వెళ్లిపోతారు. అందుకే అధికారం చేతిలో ఉందన్న భావనతో అహంభావానికి పోతే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం గులాబీ నేతలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లుగా ఉంది.
మరీ ఇంత దారుణమా? అంటూ కొన్ని సందర్భాల్లో అదే పనిగా గుండెలు బాదేసుకుంటున్న మాజీ మంత్రి హరీశ్.. గతంలో తాను ఇంతకంటే మొరటుగా వ్యవహరించానన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నారు. ఎందుకిదంతా అంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. లెక్కలు చెప్పి మరీ బదులు తీర్చుకుంటున్న వైనం ఆసక్తికరంగా మారింది. అలా అని.. రివెంజ్ తీర్చుకోవటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించకుండా.. తన వైపు వేలెత్తి చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాను తీసుకున్న నిర్ణయాల్లో తప్పు ఎత్తి చూపించే అవకాశం ఇవ్వట్లేదు.
ఒకవేళ తొందరపాటుతో ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్ల నోటి నుంచి మళ్లీ మాట రాని రీతిలో ఇన్ స్టెంట్ గా క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశానికి వెళ్లిన హరీశ్ రావు.. సమావేశం మధ్యలోనే అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. ఎందుకిలా? అంటూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు బదులిస్తూ.. శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలపటంతో తాను మధ్యలోనే బయటకు వచ్చేసినట్లుగా పేర్కొన్నారు.
గతంలో లేని సంప్రదాయాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జాబితాలో పేర్లు ఉన్న వారే బీఏసీ సమావేశానికి రావాలని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని.. అయితే తాను కడియం శ్రీహరి బీఏసీ సమావేశానికి హాజరవుతారని తమ నాయకుడు కేసీఆర్ స్పీకర్ కు తెలియజేశారని పేర్కొన్నారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్లానని.. అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పటంతో మధ్యలో వచ్చేసినట్లుగా వాపోయారు.
ఇదే వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. బీఏసీ సమావేశానికి కేసీఆర్.. కడియం శ్రీహరి పేర్లు మాత్రమే ఇచ్చారని.. అలాంటప్పుడు హరీశ్ రావు ఎందుకు హాజరవుతారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ 2014 నాటి ఘటనను గుర్తు చేశారు. అప్పట్లో టీడీపీ తరఫున బీఏసీ సమావేశానికి పాల్గొనటానికి తాను.. ఎర్రబెల్లి దయాకర్రావును తమ పార్టీ అధ్యక్షుడు బీఏసీకి పంపారని.. లోపలకు వెళ్లి కూర్చున్న తర్వాత ఒకరిని మాత్రమే అనుమతిస్తాం.. మరొకరిని అనుమతించమని లేదంటే ఇంకో పేరు ఇస్తేనే అనుమతిస్తామని చెప్పి తనను అప్పటి మంత్రి హరీశ్ రావు బయటకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు.
తమ ప్రభుత్వంలో బీఏసీ సమావేశానికి ఎవరిని అనుమతించాలనేది పూర్తిగా స్పీకర్ నిర్ణయమని.. తాము ఇందులో కలుగజేసుకోమని చెప్పటం గమనార్హం. సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని చూస్తే.. చెప్పాల్సినదంతా చెప్పేసినట్లుగా చెప్పాలి. అప్పట్లో హరీశ్ మొరటుగా వ్యవహరిస్తే.. తాజా ఎపిసోడ్ లో మాత్రం పాయింట్ చూపించి మరీ ముఖ్యమంత్రి బదులు తీర్చుకున్నారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. రేవంతా మజాకానా?