సిద్ధరామయ్య లాగేనా : మోడీతో రేవంత్...!?

తెలంగాణాలో అప్పులు ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం స్థూలంగా లెక్క తేల్చింది.

Update: 2023-12-26 00:30 GMT

కర్నాటక ఎన్నికలు జరిగి ఏడెనిమిది నెలలు అవుతోంది. కొత్తగా ముఖ్యమంత్రిగా ఎన్నిక అయిన సీనియర్ మోస్ట్ నేత సిద్ధరామయ్య ప్రధాని కేంద్రం సాయం కోసం విన్నవించుకున్నారని ప్రచారం సాగింది.అయితే మీరు అలవికాని హామీలు ఇచ్చారు మీ బాధలేవో మీరే పడండి అంటూ కేంద్రం చెప్పేసింది.

అక్కడ హామీలు ఎలా అమలు చేస్తున్నారో ఆ బాధలేంటో కన్నడీగులకే ఎరుక. సీన్ కట్ చేస్తే ఇపుడు తెలంగాణా వ్యవహారం ఉంది. తెలంగాణాలో అప్పులు ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం స్థూలంగా లెక్క తేల్చింది. అయితే ఇంకా లోతులకు వెళ్తే ఎక్కువే ఉండవచ్చు అన్నదీ ఉంది.

ఏది ఏమైనా కాంగ్రెస్ హామీలు చూస్తే భారీ బడ్జెట్ సినిమాగానే ఉన్నాయి. లక్షల కోట్ల ఖరీదు చేసే హామీలు కళ్ళెదుట ఉన్నాయి. వంద రోజుల టైం అని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఇరవై రోజులు గడచిపోయాయి. ఈలోగా ఎంపీ ఎన్నికలు ముగిస్తే అదే లెక్క లక్కూ కూడా అంటున్నారు.

అపుడే బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమి అయ్యాయి. వాటి సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తోంది. విద్యుత్ శాఖలోనే అప్పులు 80 వేల కోట్లు అంటున్నారు. వైట్ కార్డ్ హోల్డర్లకు రెండు వందల యూనిట్ల దాకా ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చేసింది.

అలాగే వైట్ కార్డు హోల్డర్లకు గ్యాస్ అయిదు వందలకు అలాగే నెలకు రెండున్నర వేల రూపాయలు మహిళలకు ఆర్ధిక సాయం అంటూ హామీలు ఇచ్చారు. ఈ క్రమంలో ముందు తెలంగాణాలో ఆర్ధిక పరిస్థితి ఏంటి అన్నది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంతా లెక్కా డొక్కా తీసి ఒక అవగాహనకు వచ్చారు.

ఆ మీదట ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఫస్ట్ టైం రేవంత్ కలవబోతున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మోడీతో రేవంత్ రెడ్డి భేటీకి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించవచ్చునని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇస్తామన్న ఆరు గ్యారంటీలు ఉన్నాయి. తెలంగాణ అప్పులు, ఆస్తులు ఇత్యాది లెక్కలూ ఉన్నాయి.

కేంద్రం అయితే ఉదారంగా ఆదుకోవాల్సి ఉంది. తెలంగాణాకు సాయపడాల్సి ఉంది. ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్రాన్ని ఇదే రకమైన సాయం కోరతారు. కానీ గత కేంద్ర ప్రభుత్వాల సంగతి ఏమైనా మోడీ వచ్చాక ఉదారంగా ఆర్ధిక సాయం అన్నది వెనక్కి పోయింది.

కేంద్రంతో రాష్ట్రాలు మంచిగా ఉంటే అప్పు చేసుకోవడానికి పచ్చ జెండా ఊపుతారు. అంటే ఆ అప్పు తీర్చుకోవాల్సింది మళ్లీ రాష్ట్రాలే. అదే కేంద్రం చేసే ఉపకారం అలాగే సాయం. అదే విధంగా అందరికీ ఆ అప్పు ఉపకారం చేయరు. తమ మాట వినే వారికే చేస్తారు. అలా ఏపీ ప్రభుత్వానికి అప్పులు తెచ్చుకునేలా సాయం చేస్తున్నారు.

గతంలో బీఆర్ఎస్ బాగా ఉన్నపుడు అప్పుల వెసులుబాటు ఉండేది, ఆ తరువాత కాలంలో అదీ లేదు, అలా వారూ ఇబ్బంది పడ్డారు. ఇపుడు రేవంత్ రెడ్డి పక్కా కాంగ్రెస్ వాది, ఆయన నడుపుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రం సాయం అంటే అది ఉంటుందా అన్న ప్రశ్న అక్కరలేదు,

అప్పులకు కూడా పచ్చ జెండా ఊపే చాన్స్ ఉండదని అంటునారు. సో ఎలా అంటే సిద్ధ రామయ్యను చూసుకుని అలాగే ముందుకు సాగిపోవడమే అంటున్నారు. మొత్తానికి మోడీతో రేవంత్ కలవడం జస్ట్ కర్టెసీ గానే మిగులుతుంది అని అంటున్నారు. అంతకు మించి వండర్స్ ఏవే జరిగేది ఉండదని అంటున్నారు.

Tags:    

Similar News