నరేంద్ర మోడీ, అమిత్ షా కు ఆర్జీవీ కీలక సూచన!!
రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీసులు అనే వ్యవహారం ఇప్పుడు మరో టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే.
రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీసులు అనే వ్యవహారం ఇప్పుడు మరో టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. వర్మ కోసం పోలీసులు రెండు రాష్ట్రాల్లో, మూడు ప్రాంతాల్లో, ఆరు బృందాలుగా అవిరామంగా వెతుకుతున్నారని కథనాలురాగా.. తాను మాత్రం హైదరాబాద్ లోని తన ఆఫీస్ (ఆర్జీవీ డెన్) లోనే ఉన్నట్లు చెబుతూ.. బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు.
ఈ సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇన్ని రోజులు మీడియాలో జరుగుతున్న ప్రచారానికీ, వాస్తవంగా జరిగినదానికీ ఏమాత్రం పొంతన లేదని స్పందించారు. అసలు తానపై నమోదైన కేసులో పెట్టిన సెక్షన్స్ లో ఏదీ తాను సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు అర్హమైనదో తనకు అర్ధం కావడం లేదన్నట్లుగా కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా సుమారు 22 పాయింట్లతో తనపై పెట్టిన కేసు ఏమిటి.. తాను విచారణకు ఎందుకు హాజరుకావడం లేదు.. ఇన్ని రోజులూ పోలీసులు వెతుకున్నారనే వార్తలొస్తున్నప్పుడు ఎక్కడున్నారు.. ఫోన్ స్విచ్చాఫ్ ఎందుకు చేశారు.. వంటి అంశాలతో భారీ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మోడీ, అమిత్ షా లను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు!
అవును... చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలువురు తనపై కేసులు పెట్టారని.. ఇలా సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం మొదలుపెడితే దీనికి అంతమే ఉండదని.. దీనిపై చర్చ జరగాలని.. దీనికి సరైన చట్టం చేయాలంటూ ఇంటర్వూలలో స్పందించిన ఆర్జీవీ.. తాజాగా ట్వీట్ చేశారు.
ఇందులో భాగంగా... తన కేసు గురించని కాదు కానీ... సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు అనే విషయంపై సరైన చర్చ జరగాల్సిన సమయం ఇదంటూ వర్మ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, రేవంత్ రేడ్డితో పాటు పలు జాతీయ స్థాయి మీడియా సంస్థలను ట్యాగ్ చేశారు.
ఈ సందర్భంగా... సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు తీవ్రమైనవి ఏమిటి.. వాటిని ఎవరు నిర్ణయిస్తారు.. ఎలా నిర్ణయిస్తారు.. అసలు అవి అభ్యంతరమైన పోస్టులుగా ఎలా నిర్ణయించబడతాయి అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తిన ఆయన... దీనిపై సరైన చట్టాలు రూపొందించాలని.. అందుకు ఇదే సరైన సమయం అని పోస్టులో పేర్కొన్నారు.