చంద్రయాన్‌-3 సక్సెస్‌ కు రాగి చెంబే కారణమని రూ.కోట్ల మోసం!

ఇటీవల భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌ లోని ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన సంగతి తెలిసిందే

Update: 2023-09-30 05:55 GMT

ఇటీవల భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌ లోని ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన సంగతి తెలిసిందే. తద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ ను దింపిన తొలి దేశంగా భారత్‌ రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా మొత్తం మీద చంద్రుడి మీద ల్యాండర్‌ ను దింపిన నాలుగో దేశం చరిత్రపుటల్లోకి ఎక్కింది.

చంద్రయాన్‌-3 సక్సెస్‌ తో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పేరు మారు మోగుతోంది. దీన్ని ఇప్పుడు కొందరు కేటుగాళ్లు తమ మోసాలకు అస్త్రంగా వాడుకుంటున్నారు. చంద్రయాన్‌-3 పేరును వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఉదంతంపై హైదరాబాద్‌ లో కేసు నమోదు అయ్యింది.

వివరాల ప్రకారం.. కొందరు మోసగాళ్లు చంద్రయాన్‌ సక్సెస్‌ కు ఒక రాగి చెంబు కారణమని భారీ మోసానికి తెర తీశారు. చంద్రయాన్‌-3 విజయానికి ఉపయోగించిన ఆ చెంబు అమ్ముతామని కిరణ్‌ అనే రియల్టర్‌ ను సంప్రదించారు. ఇది మహిమలు గల చెంబు అంటూ నమ్మబలికారు. అతడిని తమ మాటలతో బురిడీ కొట్టించారు. ఈ మోసగాళ్లను ఆయన నమ్మడంతో ఏకంగా ఆయన వద్ద నుంచి రూ.2.85 కోట్లు దోచేశారు.

ఆ తర్వాత జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్‌ నగరంలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయ్‌ కుమార్‌ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

కాగా నిందితులు పబ్బుల్లో జల్సాలు చేస్తూ విలాసవంత జీవితానికి అలవాటుపడ్డారని చెబుతున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు నల్లబోలు విజయకుమార్‌ ఒక క్షురకుడు అని సమాచారం.

అణ్వాయుధాలు, శాటిలైట్లలో వినియోగించే అద్భుత శక్తి ఉన్న రాగి చెంబు తమ వద్ద ఉందని వ్యాపారవేత్తను నమ్మించి రూ.2.85 కోట్లకు ముంచాడు. ఆయనను నమ్మించేందుకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, మరో ఇద్దరితో నాటకాన్ని నడిపించాడు. ప్రధాన నిందితుడు మేడిపల్లికి చెందిన నల్లబోలు విజయ్‌ కుమార్‌ బార్బర్‌గా పని చేసేవాడు. ఆ తర్వాత అతడు రియల్టర్‌ అవతారం ఎత్తాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు రుచిమరిగాడు.

పంజాగుట్టలోని ఓ పబ్బులో అతనికి పటాన్‌ చెరుకు చెందిన రియల్టర్‌ కిరణ్‌ పరిచయమయ్యాడు. ఆకాశం నుంచి భూమిపై పిడుగులు పడ్డప్పుడు ఏర్పడ్డ శకలాలతో తయారు చేసిన రాగి చెంబు తన దగ్గర ఉందని నిందితుడు విజయ్‌ కుమార్‌ చెప్పాడు. తన బామ్మర్ది సంతోశ్, ఐటీ ఉద్యోగి రాయుడు సాయి భరద్వాజ్, మౌలాలికి చెందిన సురేందర్‌ లతో కలిసి నాటకం ఆడించాడు. రాగి చెంబుకు అద్భుత శక్తులు నిజమేనని తాము స్వయంగా చూశామంటూ వారు బాధితుడు కిరణ్‌ ను నమ్మించారు.

ఆ రాగి చెంబు డబ్బును ఆకర్షిస్తుందని.. దాన్ని రూ.3 కోట్లకు విక్రయిస్తానని చెప్పారు. కిరణ్‌ దీన్ని కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షలు ఇచ్చాడు. తర్వాత రూ.90 లక్షలు, రూ.12.4 లక్షలు, రూ.1.30 కోట్లు.. ఇలా ఆరు నెలల్లో విడతల వారీగా రూ.2.85 కోట్లు ఇచ్చాడు. ఆ తర్వాత రాగి చెంబు ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విజయ్‌ కుమార్, భరద్వాజ్, సురేందర్, సంతోశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News