దేశంలో దాన కర్ణల జాబితా బయటకు వచ్చింది!
సంపదను పోగేయటం..అంతకంతకూ పెంచటమే తప్పించి.. చుట్టు ఉన్న వారికి తిరిగి ఇచ్చే విషయంలో అందరికి పెద్ద మనసు ఉండదు.
సంపదను పోగేయటం..అంతకంతకూ పెంచటమే తప్పించి.. చుట్టు ఉన్న వారికి తిరిగి ఇచ్చే విషయంలో అందరికి పెద్ద మనసు ఉండదు. అందరికి భిన్నంగా కొందరు మాత్రం తాము సంపాదించే సంపదను నలుగురికి పంచి పెట్టేందుకు ఆసక్తిని చూపటమే కాదు.. అంతకంతకూ తమ దాన గుణాన్ని పెంచుకుంటూ పోతుంటారు. దానం అన్నంతనే కర్ణుడు గుర్తుకు వస్తాడు. ఎవరైనా సరే.. తన వద్దకు వచ్చి చేయి చాచి అడిగితే చాలు.. వెనుకా ముందు చూసుకోకుండా ఇచ్చే గొప్పతనం అతగాడి సొంతం. అందుకే దానగుణం గురించి చెప్పాలంటే కర్ణుడి తర్వాతే ఎవరైనా అంటూ అభివర్ణిస్తుంటారు.
తాజాగా తమ సంపదను పంచి ఇచ్చే దానగుణం ఉన్న వారికి సంబంధించిన వివరాల్ని తాజాగా విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. ఎడెల్ గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా దేశంలోని దానకర్ణుల జాబితాను వెల్లడించింది. వీరిలో అందరి కంటే ముందున్నారు హెచ్ సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ్ నాడార్. తాజా జాబితా ప్రకారం చూస్తే.. రోజుకు ఆయన రూ.5.5 కోట్ల మొత్తాన్ని దానాన్ని ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏడాది కాలంలో ఆయన రూ.2042 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో ఆయన రూ.1161 కోట్లు ఇవ్వగా.. ఈసారి అంతకు మించి అన్న రీతిలో అత్యధిక విరాళాల్ని ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఆయన ఇచ్చిన విరాళాన్ని రోజుల్లో లెక్కిస్తే.. రోజుకు రూ.5.5 కోట్లు అవుతుందని నివేదికలో పేర్కొన్నారు.
శివ్ నాడార్ సంపద రూ.2.28 లక్షల కోట్లుగా వెల్లడైంది. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ. ఆయన ఏడాది కాలంలో రూ.1774 కోట్లను విరాళంగా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 267 శాతం అధికంగా విరాళం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రూ.376 కోట్లు కాగా.. ఐదో స్థానంలో గౌతమ్ అదానీ. గత ఏడాది ఏడో స్థానంలో ఉన్న ఆయన ఈసారి ఐదో స్థానానికి చేరుకున్నారు. దేశంలోని దానకర్ణుల లెక్కల్లో తెలుగు రాష్ట్రాల విషయానికివస్తే.. ముగ్గురు పేర్లు వెల్లడయ్యాయి.
ఈ నివేదికలో పేర్కొన్న పేర్లను ఎలాంటి ప్రాతిపదికన తీసుకుంటారన్న విషయానికి వస్తే.. రూ.5 కోట్లకు మించి విరాళం ఇచ్చిన వారిని తీసుకుంటారు. ఇలా 199 మందిని పరిగణలోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే.. ముగ్గురికి ఈ జాబితాలో చోటు దక్కింది. వారిలో.. దివీస్ ల్యాబ్స్ అధిపతి దివి మురళి రూ.22 కోట్లు, అరబిందో రాంప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ రూ.14 కోట్లు.. డాక్టర్ రెడ్డీస్ కు చెందిన సతీశ్ రెడ్డి ఫ్యామిలీ రూ.7 కోట్లు.. విరాళం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.