జగన్ - షర్మిళ ఆస్తి పంపకాలపై రోజా హాట్ కామెంట్స్!
ఈ సమయంలో మంత్రి ఆర్కే రోజా.. వైఎస్సార్ ఆస్తిపంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతుంది. విమర్శలు ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. పైగా నిన్నమొన్నటివరకూ రాజకీయ విమర్శలు, వాటికి సమాధానాలు ఉండే చోట.. తాజాగా షర్మిళ ఎంట్రీతో ఫ్యామిలీ మేటర్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో మంత్రి ఆర్కే రోజా.. వైఎస్సార్ ఆస్తిపంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిళ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ రాజకీయం మరింత వేడెక్కుతుంది. మైకందుకున్న ప్రతీసారీ జగన్ ని లక్ష్యంగా చేసుకుని షర్మిళ కామెంట్లు చేస్తుండగా... అందుకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వైసీపీ నేతలు గట్టిగా తగులుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా మంత్రి ఆర్కే రోజా.. వైఎస్ షర్మిళకు సూటి సమాధానాలు ఇస్తున్నారు.
తాజాగా మెగా డీఎస్సీ స్థానంలో దగా డీఎస్సీ ఇచ్చారంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన "చలో సెక్రటేరియట్" కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన షర్మిళ... జగన్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో జగన్ కంటే చంద్రబాబే మేలన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేతలు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ సమయంలో స్పందించిన రోజా... షర్మిళ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు భర్తీ చెయ్యని పోస్టులను జగన్ భర్తీ చేశారని తెలిపారు. చంద్రబాబు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చి 17వేల పోస్టులను భర్తీ చేశారని.. ఈ క్రమంలో తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని స్పష్టం చేశారు. ఇప్పుడైనా అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.
ఇదే సమయంలో... చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో వైఎస్ షర్మిలను పావుగా వాడుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో... షర్మిళ - జగన్ ఆస్తులపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై రోజా గట్టిగా తగులుకున్నారు. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ తన అన్నాతమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లకు, భార్యలకు ఎన్నెన్ని ఆస్తులిచ్చారో చెప్పాలని.. పవన్ పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోవాలని అన్నారు.
ఇదే క్రమంలో.... “వైఎస్సార్ ఎప్పుడో జగన్ అన్నకి, షర్మిళమ్మకు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్నీ కూడా పంచేశారు.. ఇంకేం కావాలి” అని మంత్రి ఆర్కే రోజా నేడు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు!