మోడీపై ఆర్ ఎస్ ఎస్ అసంతృప్తి.. ఏం జరిగింది?
కొన్ని రోజుల కిందట.. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌ను అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అరెస్టు చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నా.. మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. ''బుల్లిదేశం గుడ్లు మిటకరిస్తుంటే... మనం చప్పరిస్తున్నాం '' అని ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కొన్ని రోజుల కిందట.. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌ను అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అరెస్టు చేసింది.
ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య వివాదానికి దారి తీసింది. మరోవైపు తాజాగా శనివారం మధ్యాహ్నం మరో ఇద్దరు ఇస్కాన్ నాయకులను కూడా బంగ్లాదేశ్ సర్కారు అరెస్టు చేసింది. బంగ్లాదేశ్‌లో అల్లర్లు సృష్టిం చేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని , అందుకే అరెస్టు చేసినట్టు బంగ్లా దేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామాలపై స్పందించిన మోహన్ భగవత్.. బంగ్లాదేశ్ విషయంలో ఉదాశీనంగా వ్యవహరించడం ద్వారా.. భారత్ శత్రు దేశాలకు ఆయుధాలు అందిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్‌లో భారత హిందువులపై జరుగుతున్న దాడులను ఇస్కాన్ ప్రతినిధుల అరెస్టులను పట్టించు కోవాలని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేరుగా జోక్యం చేసుకోవాలని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే కూడా డిమాండ్ చేశారు. పొరుగు దేశాల్లో హిందువులపై దాడులను ఖండించా లని అన్నారు. ఈ విషయంలో సాచివేత ధోరణి అవలంభించడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంలో చర్చల ద్వారా సత్వర పరిష్కారానికి కేంద్రం ప్రయత్నించాలని కోరారు.
మన దేశంలో అనేక మంది ఇతర దేశాల పౌరులు నివసిస్తున్నారు., బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు జరుగుతూనే ఉన్నాయి. అయినా.. ఎవరిపైనా భారత్ దాడులు చేయదు, కేసులు కూడా పెట్టదు. కానీ, భారతీయులపై పొరుగు దేశాల్లో జరుగుతున్న హింసను మాత్రం చూస్తూ ఊరుకుంటుందా? అని ఆయన ప్రశ్నించారు. మోడీ జోక్యం చేసుకుని సమస్యలను దౌత్య పరంగా సరిదిద్దాలని ఆర్ ఎస్ ఎస్ కోరుతున్నట్టు చెప్పారు. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.