డీకే తో చంద్రబాబు... రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సమయంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు.
దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో వచ్చిన వరుస విజయాలతో కొత్త ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ పూర్వ వైభవం దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైఎస్ షర్మిళ ఎంట్రీకి పావులు కదుపుతుందని.. ఆమెను ఏపీలో ఎంటర్ చేసే రాజకీయంగా కీలక పరిణామాలు జరుగుతాయని, ఫలితంగా అవి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడానికి తోడ్పడతాయని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సమయంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోకి షర్మిళ రాక, టచ్ లో ఉన్న ఇతర పార్టీల నేతలు, ఇటీవల చంద్రబాబు - డీకే శివకుమార్ లు ఎయిర్ పోర్ట్ లో కలిసి మాట్లాడుకున్న అంశాలతో పాటు మరికొన్ని విషయాలపై రుద్రరాజు స్పందించారు.
అవును... వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఏఐసీసీలో చోటుతో పాటు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని ఒకరంటే... లేదు ఏపీకి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు మోయడానికి పంపబడతారని మరికొందరు చెబుతున్నారు! దీంతో తాజాగా ఈ విషయాలపై స్పందించిన రుద్రరాజు... షర్మిళ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని అన్నారు.
ఇదే సమయంలో షర్మిళతో పాటు ఇంకా ఎవరెవరు పార్టీలో చేరతారనే విషయం త్వరలో తెలుస్తుంది తెలిపారు. ఇదే సమయంలో పలువురు నేతలు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు! మరోవైపు ఇటీవల విమానాశ్రయంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో చంద్రబాబు కలిసి మాట్లాడిన అంశంపైనా రుద్రరాజు స్పందించారు.
చంద్రబాబు - డీకే శివకుమార్ భేటీపై తనకు క్లారిటీ లేదని అన్నారు. ఇక ఇలాంటి ఇద్దరు రాజకీయ నేతలు కలిసిన తర్వాత కచ్చితంగా రాజకీయాలే మాట్లాడుకుంటారని తెలిపిన రుద్రరాజు... చంద్రబాబు - డీకేలు సినిమాల గురించి అయితే మాట్లాడుకోరుగా అని ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఇదే సమయంలో రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలు, సిద్ధంతపరమైన విధానాలు వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఇక తనకు కూడా చంద్రబాబు దీపావళికి గిఫ్ట్ పంపించారని.. ఆ విషయం తర్వాత తెలుసుకుని ఆయనకు థాంక్స్ చెప్పినట్లు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. వ్యక్తిగత సంబంధాలను, రాజకీయాలనూ ఒకటిచేసి చూడకూడదని హితవు పలికారు. ఇక రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం కన్ ఫాం అని ధీమా వ్యక్తం చేశారు.