ఉక్రెయిన్ లో ఏం జరుగుతోంది? అనూహ్యం.. క్యాబినెట్ ప్రక్షాళన..

ఇప్పుడు రష్యా భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తున్న సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-04 14:30 GMT

రెండున్నరేళ్ల కిందట మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు, తిరుగుబాట్ల కారణంగా ప్రపంచంలో అనేక దేశాల అధినేతలు మారినా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం పదవిలో కొనసాగుతున్నారు. యుద్ధం కొలిక్కిరావడం లేదు. పైగా.. రష్యాపై దూకుడుగా వెళ్తోంది. చిన్న దేశం అయినప్పటికీ.. భారీ ఆయుధ శక్తి ఉన్న రష్యా వంటి పెద్ద దేశంతో పోరాడుతోంది. దీనికి పశ్చిమ దేశాలు సాయం చేస్తున్నాయనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు రష్యా భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తున్న సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది.

ఏం జరుగుతోంది?

ఉక్రెయిన్ లోని 40 శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి కలిపేసుకుంది. కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదటి నుంచి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా. వివిధ దేశాధినేతలతో సమావేశం కావడం, తమ దేశానికి వారు వచ్చినప్పుడు కీలక చర్చల్లో పాల్గొనడం తదితర బాధ్యతలు ఈయనే చూశారు. అయితే, ఇప్పుడు కులేబా సహా కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులందరూ రాజీనామా చేస్తున్నారు. మొత్తం 8 మంది వైదొలగినట్లు తెలుస్తోంది. ఉప ప్రధాని ఓల్హా స్టెఫానిష్యాన్‌, వ్యూహాత్మక పరిశ్రమల శాఖ మంత్రి ఒలెక్సాండర్‌ కామిషిన్ కూడా పదవిని విడిచిపెట్టారు.

ఎందుకు మారుస్తున్నారు?

కొత్త మంత్రులు ఎవరనేది తెలియకున్నా.. వారు ఎంత సమర్థులు అనేది తెలియకున్నా..క్యాబినెట్ ప్రక్షాళన అనేది యద్ధంలో ఉన్న దేశానికి అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసేందుకే క్యాబినెట్ లో మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముందు ముందు రోజులు అత్యంత కీలకం అని.. ‘ఆశించిన ఫలితాల’ను పొందేందుకు కొన్ని విభాగాలను పటిష్ఠం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే యుద్ధం తీవ్రం అవుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ దూకుడుతో వెళ్తూ.. రష్యాలోని కర్స్క్ ను స్వాధీనం చేసుకుంది. మరోవైపు మంత్రివర్గ ప్రక్షాళన ఈ వారంలోనే జరగనుంది. ఇక తాము రష్యా భూభాగంలోకి ఎంత వెళ్లినా.. వారి భూమి తమకు వద్దని జెలెన్ స్కీ ప్రకటించారు.

Tags:    

Similar News