భారత్ అడ్డుకోకుంటే.. రష్యా అణు దాడికి దిగేదే..?
ఇప్పుడు రష్యా అణు బాంబు దాడిని అడ్డుకోవడంలో భారత్ పాత్ర ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగి రెండేళ్లు గడిచాయి. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడం ఇష్టం లేని రష్యా సైనిక చర్య పేరిట విధ్వంసానికి దిగింది. సహజంగానే దీనికి ప్రతిస్పందనగా అమెరికా రంగంలోకి వచ్చింది. మిగతా నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్ కు సాధ్యమైనంత సాయం చేస్తోంది. అయితే, ఈ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. తొలి వారంలోనే రష్యా వ్యూహాత్మక అణు బాంబు దాడికి దిగుతామని బెదిరించింది. ఓ దశలో అన్నంత పని చేస్తుందా? అనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మిగతా ప్రపంచాన్ని అంతలా భయపెట్టిందీ హెచ్చరిక. అయితే, రష్యా అలాంటిదేమీ చేయలేదు. యుద్ధం మాత్రం కొనసాగిస్తోంది. ఇప్పుడు రష్యా అణు బాంబు దాడిని అడ్డుకోవడంలో భారత్ పాత్ర ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.
అమెరికా అప్రమత్తం..
ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడి చేస్తుందని అమెరికా మొదటినుంచి అనుమానిస్తోంది. అదే జరిగితే ఏం చేయాలి అనే అంశంపై 2022లోనే పూర్తి కసరత్తు చేసింది. అయితే, భారత్, చైనా అధినేతల ప్రకటనలతో అణు దాడి విషయంలో రష్యా వెనక్కుతగ్గింది. దీన్ని బైడెన్ కార్యవర్గానికి చెందిన ఇద్దరు అధికారులు ఓ ఆంగ్ల వార్తా సంస్థకు తెలిపారు.
యుద్దం మొదలైన కొద్ది రోజులకే తూర్పు ఉక్రెయిన్ లోని ఖేర్సన్‌లో రష్యాకు ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ప్రతీకారంగా అణుదాడి జరగవచ్చని అమెరికా భావించింది. ఈ ప్రాంతాన్ని తమది అని రష్యా ప్రకటించడం కూడా ఈ అనుమానానికి కారణం. దీంతో పుతిన్ అణు దాడికి దిగొచ్చని భావించారు. ఖేర్సన్ లో తగిలిన దెబ్బలను సాకుగా చూపించే చాన్సుందని కూడా భావించారు. ఇదే సమయమంలో ఉక్రెయిన్ డర్టీబాంబ్ కోసం యత్నిస్తోందని రష్యా ఆరోపణలు చేసింది కూడా.
రష్యా అణుదాడికి పాల్పడకుండా నచ్చజెప్పేందుకు భారత్, చైనా సాయాన్ని అమెరికా కోరింది. నేరుగా హెచ్చరిస్తూనే.. మరోవైపు ఇతర దేశాలతో కూడా దానికి చెప్పించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోదీ చేసిన ప్రకటనలు కొంతమేర ఫలించాయి. తర్వాత యుద్ధం ప్రతిష్టంభన దశకు చేరి అణుదాడి ఆందోళనలు తగ్గాయి.
‘వ్యూహాత్మకం’ అందుకే..
ఒకవేళ రష్యా భారీ అణ్వాయుధాలు తరలిస్తే.. అమెరికా సులువుగా పసిగట్టేస్తుంది. కానీ చిన్న పరిమాణంలోని వ్యూహాత్మక అణుబాంబులు తరలిస్తే గుర్తించడం అసాధ్యం. ఈ నేపథ్యంలోనే రష్యా వ్యూహాత్మక అణు బాంబులు ప్రయోగించే ప్రమాదం ఉందని ఆందోళన చెందింది. దీంతో అమెరికా వర్గాలు నేరుగా తమ భయాలను రష్యాకు వివరించాయి. మిత్ర దేశాలతో కలిసి దాడిని నివారించేందుకు ప్లాన్ వేసింది.