జగ్గీ వాసుదేవ్ కు అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
అలాంటి జగ్గీ వాసుదేవ్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు వారాలుగా ఆయన విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు
ప్రముఖ సద్గురు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ గురించి తెలియనివారు లేరు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఆయన ఆశ్రమానికి రోజూ లక్షల్లో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. సోషల్ మీడియాలో తన ప్రసంగాల ద్వారా ఎంతో మందికి సద్గురు జగ్గీ వాసుదేశ్ మార్గనిర్దేశనం చేస్తున్నారు.
అలాంటి జగ్గీ వాసుదేవ్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు వారాలుగా ఆయన విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆ బాధను విస్మరించి తన కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో మార్చి 15న సద్గురు వాసుదేవ్ మెదడులో భారీ రక్తస్రావం కనిపించింది. అయినప్పటికీ శక్తివంతమైన నొప్పి నివారణ మందుల సాయంతో ఆయన ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో మార్చి 17న సద్గురు తన ఎడమ కాలు బలహీనంగా ఉందని, నిరంతర వాంతులతో తలనొప్పి తీవ్రంగా ఉందని జగ్గీ వాసుదేవ్ తన సహాయకులకు చెప్పారు. దీంతో ఢిల్లీకి తరలించారు. అక్కడ అపోలో ఇంద్రప్రస్థ ఆస్పత్రిలో వైద్యులు వైద్య పరీక్షలు చేసి వాసుదేవ్ కు మెదడులో రక్తస్రావం అవుతోందని తేల్చారు. డాక్టర్ వినిత్ సూరి సలహా మేరకు సద్గురు అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు.
ప్రస్తుతం సద్గురు వాసుదేవ్ ఆరోగ్యం కుదుటపడుతోందని, అంచనాలకు మించి కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత నాలుగు వారాలుగా తలనొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన తన షెడ్యూల్ మేరకు కార్యక్రమాలను కొనసాగించారని తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 8న మహాశివరాత్రి వేడుకలను నిర్వహించారని ఈశా ఫౌండేషన్ గుర్తు చేసింది.
అపోలో ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి మాట్లాడుతూ, ‘‘మేము చేయగలిగినది చేశాం.. కానీ మీరే నయం చేస్తున్నారు అని మేము సద్గురుతో సరదాగా అన్నాం. ఆయన విషయంలో మేము చూస్తున్న పురోగతి మా అంచనాలకు మించి ఉంది. ఆయన ఇప్పుడు చాలా బాగున్నారు. ఆయన మెదడు, శరీరంలో ఇతర ముఖ్యమైన అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయి’ అని తెలిపారు.
శస్త్ర చికిత్స తర్వాత సద్గురు జగ్గీ వాసుదేవ్ మాట్లాడిన ఓ వీడియోను ఇనస్టాగ్రామ్ లో ఈశా ఫౌండేషన్ పోస్ట్ చేసింది. అపోలో ఆసుపత్రి న్యూరోసర్జన్లు నా కపాలాన్ని కోసి, ఏదో కనుగొనేందుకు ప్రయత్నించారని వాసుదేవ్ తెలిపారు. కానీ వారికి ఏమీ దొరకలేదని చమత్కరించారు. మొత్తం ఖాళీ అయిన అతుకు వేసిన కపాలంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని జగ్గీ వాసుదేవ్ ఆ వీడియోలో వెల్లడించారు.
మరోవైపు సద్గురుతో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.