మోడీ - జగన్ సంబంధాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు... తెరపైకి షర్మిళ పై ప్రేమ!
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. రోజు రోజుకీ రాజకీయ వాతావరణం వేడెక్కితోంది.. ఇక విమర్శలు, ప్రతి విమర్శలతో రసవత్తర రాజకీయం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీకి జగన్ కి ఉన్న సంబంధం.. ఎన్డీయేలోకి వైసీపీకి ఆహ్వానం.. షర్మిళపై జగన్ కి ఉన్న ప్రేమ మొదలైన విషయాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సాధారణంగా ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పటికీ నడుస్తుంటుంది. చిలకలూరిపేట సభ తర్వాత కూడా మరింత ఎక్కువగా జరుగుతుంది. అదేమిటంటే... మోడీకి జగన్ అత్యంత విధేయుడిగా ఉంటారని.. జగన్ అంటే మోడీకి నమ్మకం, గౌరవం అని.. అందుకే జగన్ పై మోడీకానీ, మోడీపై జగన్ కానీ ఎలాంటి వ్యక్తిగత విమర్శలూ చేసుకోరని!
తాజాగా ఈ విషయాలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి... జగన్ - మోడీ సంబంధంపై స్పందించారు. ఇందులో భాగంగా... ప్రధాని నరేంద్ర మోడీతో, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నదీ కేవలం ప్రభుత్వ పరమైన సంబంధం మాత్రమే అని వెల్లడించారు. జగన్ ఎప్పుడూ.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వంతో అవసరం మేరకు సత్సంబంధాలను కొనసాగించారని స్పష్టం చేశారు.
వాస్తవానికి ఎన్డీయేలో చేరాలని తమకు ఏనాడొ ఆహ్వానం వచ్చిందని షాకింగ్ విషయం చెప్పిన సజ్జల... పొత్తు వద్దు, ఒంటరిగానే పోటీ చేయాలని భావించడంవల్లే చేరలేదని స్పష్టం చేశారు. ఎన్డీయేతో పొత్తుపెట్టుకుని కలిసి పోటీ చేస్తే తేడాలు వస్తాయనే ఉద్దేశ్యంతోనే తాము పొత్తు ఆలోచనే చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో... గతంలో ఎన్డీయేతో పెట్టుకుని, బయటకు వచ్చాక మోడీని చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారని.. తాము అలా మాట్లాడలేమని తెలిపారు.
ఇదే సమయంలో వైఎస్సార్ కుటుంబంలోని సమస్యలు, అన్నా చెల్లెలి మధ్య సంబంధాల గురించి స్పందించిన సజ్జల... రాజకీయ విభేదాలను, కుటుంబ విభేదాలుగా మార్చి చూపించి, తద్వారా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు లాంటివారు చూస్తారని చెప్పారు. అయితే... జగన్ కు షర్మిళకు మధ్య ఉన్నవి కేవలం రాజకీయపరమైన అభిప్రాయ భేదాలు మాత్రమే తప్ప.. వైఎస్సార్ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు.
ఇక రాజకీయంగా వైఎస్ షర్మిళ కొన్ని తప్పటడుగులు వేసినట్లు తెలిపిన సజ్జల... షర్మిళ అంటే జగన్ కు ఒక అన్నగా ఎంత ప్రేమ ఉండాలో అంతప్రేమా ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!