వైఎస్ షర్మిళ వ్యాఖ్యలపై సజ్జల ఇంట్రస్టింగ్ రియాక్షన్!
సజ్జల... అసలు షర్మిళ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారో తెలియదని.. ఇప్పుడు ఏపీకి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారో కూడా తెలియదని అన్నారు!
ప్రస్తుతం ఏపీలో "కూటమీ వర్సెస్ వైసీపీ" రాజకీయం నడుస్తున్న వేళ తాజాగా తాముకూడా బరిలో ఉన్నామంటూ మరో కూటమి ఎంటరైంది! ఇందులో భాగంగా... వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది! ఈ మేరకు 5 ఎంపీ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులనూ ప్రకటించింది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటన అనంతరం కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు చెప్పి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిళ. దీంతో ఆమె వ్యాఖ్యలపై సజ్జల తాజాగా స్పందించారు.
అవును... ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం మాట్లాడిన షర్మిళ.. ఏపీ ముఖ్యమంత్రి, తన అన్న వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నా అనుకున్న వాళ్లందరినీ జగన్ నాశనం చేశారని.. చిన్నాన్నను హత్య చేసిన వాళ్లనూ, చేయించినవాళ్లనూ వెనకేసుకొస్తున్నారని.. హంతకులు తప్పించుకుని తిరుగుతున్నా శిక్షపడకుండా వారిని కాపాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో ఈ విషయాలపై తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... వివేకా హత్య గురించి గత ఐదేళ్లుగా మాట్లాడని షర్మిళ, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇదే సమయంలో... షర్మిళ, సునీతల వెనుక చంద్రబాబు ఉన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం రక్తపు మడుగులో ఉందని ఏలా అంటారని.. అసలు వివేకా హత్యతో జగన్ కు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో... షర్మిళ ఆరోపణలకు తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పిన సజ్జల... అసలు షర్మిళ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారో తెలియదని.. ఇప్పుడు ఏపీకి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారో కూడా తెలియదని అన్నారు!
అనంతరం.. చంద్రబాబు తీరుపై మండిపడిన సజ్జల... చంద్రబాబుకు స్వార్థం తప్ప మరేమీ ఉండదని.. ఆ స్వార్థంతోనే ఆయన ఏమి చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని అన్నారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు తీరు చూసిన ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయని తెలిపారు. ఇక, నిన్నమొనంటివరకూ ఏపీలో జగన్ సర్కార్ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు చేసి... ఇవాళ వాళ్లే లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచొచ్చు కదా అని అంటున్నారని అన్నారు!
ఇక ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం లేకపోవడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పిన సజ్జల... గతంలో ఒకటో తేదీన వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో సుమారు 80 శాతం పంపిణీ పూర్తయ్యేదని అన్నారు. అయితే... ప్రస్తుతం మాత్రం రెండో రోజుకి 60 శాతం పంపిణీ జరిగిందని తెలిపారు. పైగా ఈ ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజలు ఎంత కోపంగా ఉన్నరనే విషయం టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తోందని అన్నారు!