మరో 7 అరెస్టులు.. స్కిల్ స్కాంపై సంజయ్ సంచలనం
సంజయ్ మాటలతో స్కిల్ స్కాంకు సంబంధించిన పరిధి అంతకంతకూ పెరుగుతుందన్న విషయం తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతుందని చెప్పాలి.
సంచలనంగా మారిన స్కిల్ స్కాంకు సంబంధించి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి మాట్లాడిన ఆయన.. ఈ కేసుకు సంబంధం ఉన్న పలువురు ఇప్పటికే అరెస్టు అయ్యారన్నారు. అయితే.. వారిని ఈడీ అరెస్టు చేసిందని చెప్పుకొచ్చారు.
స్కిల్ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తూ ఇప్పటికే సుమన్ బోస్.. డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్.. స్కిల్లర్ ప్రైవేటు లిమిటెడ్ మాజీ ఆర్ధిక సలహాదారు ముకుల్ చంద్ర అగర్వాల్.. సీఏ సురేష్ గోయెల్ ను అరెస్టు చేశారని చెప్పారు.పదమూడు డిజిటల్ సంతకాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేశామన్నారు. ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర ఆధారాలతో సహా బయటపడిందన్నారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిందని.. ఈ కేసులో మరో ఏడుగురిని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు.
సంజయ్ మాటలతో స్కిల్ స్కాంకు సంబంధించిన పరిధి అంతకంతకూ పెరుగుతుందన్న విషయం తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతుందని చెప్పాలి. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టు జరిగిన పక్షంలో.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉండదన్న మాట వినిపిస్తోంది.
సంజయ్ చెప్పినట్లుగా ఈ కేసులో అరెస్టు కానున్న ఆ ఏడుగురు ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా లోకేశ్ ను అరెస్టు చేయాలన్న ఆలోచనలో సీఐడీ ఉన్నట్లుగా బ్రాహ్మణి వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
ఆమె నోటి నుంచి అరెస్టు మాట వచ్చిన రెండు రోజులకే సీఐడీ కీలక అధికారి నోటి నుంరి అరెస్టు మాట రావటం చూస్తే. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ వాతావరణం అరెస్టులతో మరింత వేడెక్కటం ఖాయమనే చెప్పాలి.