లాటరీ కింగ్.. ఈడీ సోదాలో కళ్లు చెదిరే నిజాలు

శాంటియాగో మార్టిన్‌ మయన్మార్‌లో కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. 1988లో భారత్‌కు తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించాడు.

Update: 2025-01-03 10:20 GMT

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బహిర్గతం చేయాలని గతంలో ఆదేశించింది. దాంతో చాలా మంది ఎలక్టోరల్ బాండ్లను బయటపెట్టారు. అందులోభాగంగా లాటరీ కింగ్ పేరు సైతం మార్మోగింది. దేశవ్యాప్తంగా ఆయన పేరు సంచలనంగా మారింది. ఆయనే శాంటియాగో మార్టిన్.

శాంటియాగో మార్టిన్‌ మయన్మార్‌లో కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. 1988లో భారత్‌కు తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించాడు. కర్నాటక, కేరళకు తన వ్యాపారాన్ని విస్తరించాడు. అనంతరం ఈశాన్య భారత్‌కు తన మకాం మార్చాడు. ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. మరికొన్నాళ్లకు భూటాన్, నేపాల్‌లో స్తిరాస్తి, నిర్మాణ, టెక్స్‌టైల్ బిజినెస్‌లను ప్రారంభించాడు. అతని నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లోనూ సభ్యత్వం ఉంది.

శాంటియాగో మార్టిన్ లాటరీ స్కీములతో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. స్కీముల పేరుతో మోసాలకు పాల్పడి రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.15వేల కోట్ల సంపదను కొల్లగొట్టాడు. ఈడీ దర్యాప్తుతో ఆయన ఆస్తులు, మోసాల చిట్టా వెలుగుచూసింది. వాటిని చూసిన వారంతా ఒక్కసారిగా నోళ్లు తెరిచారు.

పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూడడంతో ఈడీ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. శాంటియాగో మార్టిన్‌కు ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఉంది. దీనిపై లాటరీ పేరిట చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2014లో సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా 2018లో మార్టిన్ సహా ఆయన బంధువులు, సంస్థలో పనిచేసిన అధికారులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా లాటరీ కింగ్‌కు చెందిన రూ.1,000 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకుంది. మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

లాటరీ విక్రయాల్లో భారీగా అవకతవకలకు పాల్పడిన విషయాన్ని ఈడీ గుర్తించింది. లాటరీ పేరిట వచ్చిన సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేసేందుకు మార్టిన్ ఏకంగా 350కి పైగా కంపెనీలను ప్రారంభించారు. చాలా రకాల వాహనాలను కొనుగోలు చేశాడు. విక్రయదారులకు ప్రైజ్ విన్నింగ్ లాటరీలు ఇచ్చి వారి నుంచి ఆస్తులను కొనుగోలు చేసేవాడు. మరోవైపు.. లాటరీ డిస్ట్రీబ్యూటర్లుగా తన బంధువులను, స్నేహితులను నియమించుకున్నట్లు ఈడీ గుర్తించింది.

ప్రైజ్ విన్నింగ్ లాటరీలను వీరి వద్దే ఉంచుకొని మిగితా వాటిని విక్రయించే వారు. కోట్లు కలిసొచ్చే లాటరీలను విక్రయించకుండా వారి వద్దే పెట్టుకునే వారు. ఈడీ సోదాల సమయంలో వందలాది బెండల్స్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లాటరీలు అమ్మి ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఏడాదికి రూ.15వేల కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్లు ఈడీ గుర్తించింది. ప్రభుత్వానికి మాత్రం చాలా తక్కువ మొత్తంలో లాభాలను ఆర్జించినట్లు చూపించారు. ఈ సంస్థ నుంచి వచ్చిన ఆదాయంతోనే రూ.1,300 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాడు. వాటిని 2019-2024 మధ్య పలు రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చినట్లు ఇటీవల వెల్లడైంది.

Tags:    

Similar News