జాక్‌ పాట్‌ అంటే ఇదే.. మొదటిసారి ఎమ్మెల్యే.. వెంటనే మంత్రి!

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్డీయే మంత్రివర్గంలో కొందరికి జాక్‌ పాట్‌ తగిలింది. ముఖ్యంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ యాదవ్‌ హాట్‌ టాపిక్‌ గా నిలిచారు.

Update: 2024-06-12 07:28 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్డీయే మంత్రివర్గంలో కొందరికి జాక్‌ పాట్‌ తగిలింది. ముఖ్యంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ యాదవ్‌ హాట్‌ టాపిక్‌ గా నిలిచారు. ఆయన ఈ ఎన్నికల్లో అనూహ్యంగా అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఊహించని విధంగా గెలుపొందారు. ధర్మవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన బలమైన అభ్యర్థి అయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విజయం సాధించారు.

వాస్తవానికి ధర్మవరంలో సత్యకుమార్‌ గెలుపుపై ఎవరికీ అంచనాలు లేవు. ‘గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం’ పేరిట కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజల్లోకి దూసుకెళ్లారు. పలు పర్యాయాలు నియోజకవర్గమంతా చుట్టేశారు. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తిపైన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సత్యకుమార్‌ యాదవ్‌ గెలుపు అంత సులువు కాదని అంచనాలు వెలువడ్డాయి.

అయితే తన ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తదితర జాతీయ ప్రముఖులను తీసుకొచ్చిన సత్యకుమార్‌ యాదవ్‌ తన సత్తా చాటారు. ఈ ఎన్నికల్లో 3,784 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పది అసెంబ్లీ సీట్లు తీసుకుని పోటీ చేయగా 8 చోట్ల విజయం సాధించడం విశేషం. ఇందులో ధర్మవరం కూడా ఒకటి కావడం గమనార్హం.

ఈ క్రమంలో జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో ఉన్న సత్సంబంధాలు, సామాజిక సమీకరణాలు కలిసి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా బీజేపీ తరఫున మంత్రి పదవిని దక్కించుకున్న నేతగా సత్యకుమార్‌ యాదవ్‌ నిలిచారు.

అంతేకాకుండా సత్యకుమార్‌ మహారాష్ట్రకు చెందినవారు. అక్కడి నుంచి వచ్చి హిందూపురంలో స్థిరపడ్డారు. మరాఠీ, హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో మంచిపట్టుంది.

వెంకయ్య నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన సత్యకుమార్‌ యాదవ్‌.. వెంకయ్య నాయుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాక తనకున్న పరిచయాలతో బీజేపీ జాతీయ కార్యదర్శి అయ్యారు. అంతేకాకుండా ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేసి అక్కడ పార్టీ అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించారు.

మంత్రి పదవులు కోసం బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌ రాజు వంటి వారు పోటీ పడ్డా వారిని తోసిరాజని సత్యకుమార్‌ యాదవ్‌ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ముఖ్యంగా అటు బీజేపీ, ఇటు టీడీపీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న సుజనా చౌదరికి కాకుండా సత్యకుమార్‌ యాదవ్‌ కు మంత్రి పదవి దక్కడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News