పులి లాంటి రెడ్డి గారు సైకిల్ దిగేస్తున్నారు...!

పులివెందులలో సతీష్ రెడ్డి కనుక వైసీపీలో చేరిపోతే ఇక టీడీపీకి అది భారీ షాక్ అనే అంటున్నారు.

Update: 2023-10-06 16:56 GMT

కడప జిల్లాలో పులివెందుల వైసీపీకి కంచుకోట. 1978 నుంచి ఆ ఫ్యామిలీ తప్ప అక్కడ ఎవరూ నెగ్గలేదు. వైఎస్సార్, ఆయన సతీమణి విజయమ్మ, వైఎస్సార్ సోదరుడు వివేకానందరెడ్డి, ఇపుడు వైఎస్ జగన్ ఇలా ఒకే ఫ్యామిలీ వారిని అందరినీ ఆదరిస్తోంది పులివెందుల. జగన్ కి 2014లో నలభై అయిదు వేల దాకా మెజారిటీ వస్తే 2019 నాటికి అది తొంబై వేల పై చిలుకు అయింది. 2024లో జగన్ మళ్లీ పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే పులివెందుల లో పులిలాంటి నేత ఒకరు ఉన్నారు. ఆయన టీడీపీకి అండగా ఉన్నారు. ఆయనే సతీష్ రెడ్డి. వైఎస్సార్ మీద రెండు సార్లు, జగన్ మీద మరో రెండు సార్లు పోటీ చేసి ఓడిన నేత. ఆయన టీడీపీకి అండ దండగా ఉంటూ వస్తున్నారు. పెద్ద దిక్కు గా ఉంటున్నారు. అలాంటి సతీష్ రెడ్డి ఇపుడు సైకిల్ దిగేస్తున్నారు.

ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి మారిపోతున్నారు. ఏ జగన్ మీద అయితే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారో అదే జగన్ పార్టీలో చేరిపోతున్నారు. ఈ నెల 13న ఆయన వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.

పులివెందులలో సతీష్ రెడ్డి కనుక వైసీపీలో చేరిపోతే ఇక టీడీపీకి అది భారీ షాక్ అనే అంటున్నారు. ఇదిలా ఉండగా టీడీపీకి గత రెండున్నర దశాబ్దాలుగా పెద్ద దిక్కుగా ఉంటూ పులివెందులలో పార్టీని నిలబెట్టిన నేతగా సతీష్ రెడ్డికి పేరుంది. వైఎస్సార్ సీఎం గా ఉన్నా జగన్ సీఎం గా ఉన్నా తట్టుకుని నిలబడ్డార్ సతీష్ రెడ్డి.

అయితే ఆయనను చాలా కాలంగా టీడీపీ అధినాయకత్వం పట్టించుకోవడంలేదు అని అంటున్నారు. బీటెక్ రవి కొత్తగా పులివెందులలో లీడర్ గా ముందుకొచ్చాడు. దాంతో ఆయనకు ప్రయారిటీ ఇస్తూ సతీష్ రెడ్డిని పక్కన పెట్టేశారు అని అంటున్నారు. ఇక బీటెక్ రవి అతి చేస్తారు, ఆయన రాజకీయం వేరే విధంగా ఉంటుంది. మరి అది నచ్చి టీడీపీ అధినాయకత్వం హుందాగా రాజకీయాలు చేసే సతీష్ రెడ్డిని సైడ్ చేసింది అని అంటున్నారు.

కొంతకాలం పాటు రాజకీయాలకు స్వస్తి చెప్పి సతీష్ రెడ్డి తన సొంత వ్యవహారాలు చూసుకున్నారు. అయితే ఇపుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఆయన వైసీపీలో చేరడం విస్మయంగానే ఉంది. సతీష్ రెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. ఆయనకంటూ సొంత అనుచర వర్గం ఉంది. అంతా కలసి ఇపుడు జై జగన్ అనబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మీద బీటెక్ రవిని నిలబెడతారు అని అంటున్నారు.

వైఎస్సార్ కి జగన్ కి టఫ్ ఫైట్ ఒక దశలో ఇచ్చిన సతీష్ రెడ్డి వైసీపీలోకి రావడం లాభదాయకం అంటున్నారు. అదే టీడీపెకి షాకింగ్ పరిణామం అంటున్నారు. బీటెక్ రవి ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా జగన్ గెలుపుని ఆపలేరు, ఇపుడు మెజారిటీ కూడా ఇంచ్ తగ్గదని అంటున్నారు. ఏది ఏమైనా సతీష్ రెడ్డి చేరికతో వైసీపీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. రాయలసీమ కోస్తా అని చూడకుండా పెద్ద ఎత్తున టీడీపీ నేతలను ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది అంటున్నారు.

Tags:    

Similar News