ఆ స్వామీజీ తల తెస్తే రూ.100 కోట్లు ఇస్తా: సినీ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు!

ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారితీశాయి.

Update: 2023-09-07 05:37 GMT

సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోలుస్తూ దాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే ప్రభుత్వంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారితీశాయి.

ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంస్థలు, సంఘాలు, పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యకు చెందిన పరంధాస్‌ ఆచార్య అనే స్వామిజీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తల నరికి తనకు తెచ్చి ఇస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కలకలం రేపారు. ఈ సందర్భంగా ఒక చేతిలో ఉదయనిధి ఫోటో, మరో చేతిలో అతడి తలను నరుకుతున్న వీడియోను స్వామజీ పరంధాస్‌ ఆచార్య చూపించారు. ఈ పని మీరు త్వరగా చేస్తే రూ. 10 కోట్లు ఇస్తాను అంటూ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఉదయనిధి ఫొటోను తగలబెడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై ఉదయనిధి స్పందిస్తూ.. ఓ స్వామీజీ తన తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ప్రకటించారన్నారు. ఆయన నిజంగా సాధువా, లేక డూప్లికేట్‌ స్వామీజీనా ? అని ప్రశ్నించారు. ఈ స్వామీజీలకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తల తీసే బదులు 10 రూపాయల దువ్వెన ఇస్తే నేను తల చక్కగా దువ్వుకుంటాను కదా అంటూ ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలో స్వామీజీపై తమిళనాడు ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ మేరకు స్వామీజీపై పలువురు డీఎంకే నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

మరోవైపు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తలకు రూ.10 కోట్లు ప్రకటించిన అయోధ్య సాధువు తల తెచ్చిచ్చేవారికి రూ.100 కోట్లు అందిస్తామని తమిళనాడులోని నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌ సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి స్టాలిన్‌ విసిరిన బంతితో బీజేపీ వాళ్లు ఆడుకుంటున్నారన్నారు.

ఒకరు చెప్పిన అభిప్రాయాన్ని మాటలతోనే ఎదుర్కోవాలని, అదే ప్రజాస్వామ్యం అవుతుందని సీమాన్‌ అభిప్రాయపడ్డారు. దాన్ని వదిలేసి ఉదయనిధి స్టాలిన్‌ తల తీసుకొచ్చే వారికి రూ.10 కోట్లు ఇస్తానని అయోధ్య సాధువు చెప్పడం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తల నరికేస్తా, నాలుక పీకేస్తా అనేవాళ్లు సాధువులు కాదని మండిపడ్డారు.

ఇప్పుడు సీమాన్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్‌ గా మారాయి. స్వామీజీ తల తెస్తే రూ.100 కోట్లు ఇస్తానని ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఈ స్థాయిలో తన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతున్నా తగ్గేదే లే అని ఉదయనిధి స్టాలిన్‌ చెబుతున్నారు. తనపైన కేసులు వేసుకున్నా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని అంటున్నారు. ఇవేవీ తాను ఇప్పుడు చెప్తున్నవి కాదని అంబేద్కర్, పెరియార్‌ వంటివారు ఎప్పుడో చెప్పారంటూ తన వ్యాఖ్యలను ఉదయనిధి సమర్థించుకుంటుండటం గమనార్హం.

Tags:    

Similar News