వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత!?
సీటు దక్కించుకునేందుకు రకరకాల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. టికెట్లు లభించిన నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తమకు సీటు ఇవ్వని పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తమ అనుచరులు, కార్యకర్తల చేత ఆత్మహత్యాయత్నాలు కూడా చేయిస్తున్నారు. సీటు దక్కించుకునేందుకు రకరకాల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేఎస్ జవహర్ వైసీపీలో చేరుతున్నారని టాక్ నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన రెండు జాబితాల్లోనూ జవహర్ కు సీటు దక్కలేదు. 2014లో ఆయన తొలిసారి కొవ్వూరులో పోటీ చేసి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత హోం శాఖ మంత్రి తానేటి వనితపై విజయం సాధించారు. అంతేకాకుండా దళిత కోటాలో మంత్రిగా కూడా కేఎస్ జవహర్ అవకాశం దక్కించుకున్నారు.
ఇక 2019లో కేఎస్ జవహర్ ను కృష్ణా జిల్లాలోని తిరువూరు నుంచి చంద్రబాబు బరిలో దింపారు. అయితే వైసీపీ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి చేతిలో జవహర్ ఓటమిపాలయ్యారు. 10,800 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి మరోసారి కొవ్వూరు సీటును కేఎస్ జవహర్ ఆశించారు. అయితే ఆయనకు సర్వేలు అనుకూలంగా లేకపోవడం, నియోజకవర్గంలో ఇంకో వర్గం ఆయనను గట్టిగా వ్యతిరేకిస్తుండటం వంటి కారణాలతో చంద్రబాబు ఆయనకు సీటును ఇవ్వలేదు. కొవ్వూరు సీటుకు టీడీపీ తరఫున ముప్పిడి వెంకటేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించారు.
చంద్రబాబు ప్రకటనపై కేఎస్ జవహర్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తనవైపే ఉన్నాయన్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరులో గెలుపొందే అవకాశమే లేదన్నారు. ఆయన ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పారు. టికెట్ విషయంపై చంద్రబాబు మరోసారి పునరాలోచించాలని కోరారు. చంద్రబాబు నిర్ణయం తనకు అనుకూలంగా లేకుంటే ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.
కాగా కేఎస్ జవహర్ ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని నానితో జవహర్ భేటీ అయ్యారని అంటున్నారు. వైసీపీలో చేరికకు ఆసక్తి చూపారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేడో, రేపో జవహర్ వైసీపీ తీర్థం పుచ్చుకోవచ్చని టాక్ నడుస్తోంది.