రీల్ మాదిరి రియల్ స్టోరీ: అమ్మానాన్నలకు మళ్లీ పెళ్లితో.. చిట్టి తల్లి ఇంటికి
జాగ్రత్తగా చూడాలే కానీ మన చుట్టూనే బోలెడన్ని కథలు ఉంటాయి. అవి అలాంటి ఇలాంటివి కాదు. సినిమా కథల మాదిరిగా ఉంటాయి.
జాగ్రత్తగా చూడాలే కానీ మన చుట్టూనే బోలెడన్ని కథలు ఉంటాయి. అవి అలాంటి ఇలాంటివి కాదు. సినిమా కథల మాదిరిగా ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా అలాంటి కోవకు చెందిందే. అసలు ఇలా జరుగుతుందా? అన్న భావన కలగటమే ఈ స్టోరీ స్పెషాలిటీ. ఇద్దరు పెళ్లి చేసుకోవటం.. అమ్మాయి మైనర్ కావటంతో భర్త జైలుకు వెళితే.. వారికి పుట్టిన బిడ్డ శిశువిహార్ కు వెళ్లాల్సి వచ్చింది. తెలిసి తెలియనితనంతో జరిగిన తప్పునకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇలాంటి వేళలో.. ఒక కలెక్టర్ చొరవతో మళ్లీ ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరియటమేకాదు.. ఏడాదిగా శిశువిహార్ లో ఉన్న ఆ చిన్నారికి అమ్మ ఒడికి వచ్చి చేరింది. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర ఉదంతంలోకి వెళితే.. పుల్లల చెరువు మండలానికి చెందిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి నందిత అనే అమ్మాయితో 2022లో పెళ్లైంది. అయితే ఆమె అప్పటికే గర్భవతి. ఇద్దరిది లవ్ మ్యారేజ్. పెళ్లై.. గర్భవతిగా ఉన్న నందిని మేజర్ కాకపోవటంతో వీరి వ్యవహారం పోలీసులకు ఫిర్యాదు రూపంలో వెళ్లింది. దీంతో.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది.
మైనర్ ను పెళ్లి చేసుకోవటం.. గర్భవతి కావటంతో భర్తను జైలుకు పంపారు. నందిని 2023లో ఆడపిల్లకు జన్మనివ్వగా.. చిన్నారిని శిశువిహార్ కు అధికారులు అప్పగించారు.ఇలా పసికందు తల్లిదండ్రులకు దూరమైంది. నందిని ప్రస్తుతం మేజర్ కావటంతో.. భాస్కర్ రెడ్డి మళ్లీ ఆమెను పెళ్లాడారు. దీంతో.. చట్టబద్ధంగా వారిద్దరు భార్యభర్తలు అయ్యారు. అయితే.. తమ కుమార్తెను తమకు ఇవ్వాలని కోరినా ఫలితం లేకపోయింది.
దీంతో.. ఈ దంపతులు ఇద్దరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. వారి గురించి మొత్తం తెలుసుకున్న ఆమె.. అందుకు సానుకూలంగా స్పందించారు. జిల్లా మహిళా.. శిశు సంక్షేమ శాఖ అధికారిణితోపాటు.. ఇతర అధికారుల సమక్షంలో పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఉదంతం స్థానికంగా ఆసక్తికరంగా మారటంతో పాటు.. అందరూ మాట్లాడుకునేలా చేసింది.