షర్మిల వెంట వైఎస్సార్ నీడ...!
అలా కనుక చూసుకుంటే కాంగ్రెస్ లో వైఎస్సార్ కి అండగా నిలిచిన వారు ఆయన నేస్తం కేవీపీ రామచంద్రరావు. ఆయన వైఎస్సార్ ని వెన్నంటి ఉండేవారు.
వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు తీసుకోబోతున్నారు. ఆమె ఈ నెల 21న ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కీలకమైన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఒకనాడు ఉమ్మడి ఏపీకి పీసీసీ ప్రెసిడెంట్ గా రెండు సార్లు పనిచేసిన వైఎస్సార్ తనయగా షర్మిల అదే హోదాలో పార్టీ పగ్గాలు అందుకోవడం ఒక విశేషంగా చూడాలి.
కాంగ్రెస్ అంటే మహా సముద్రం. అందులో ఎదురీతలు ఉంటాయి. అలాగే ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి. సరైన వ్యూహాలతో ముందుకు సాగాలి. అలా కనుక చూసుకుంటే కాంగ్రెస్ లో వైఎస్సార్ కి అండగా నిలిచిన వారు ఆయన నేస్తం కేవీపీ రామచంద్రరావు. ఆయన వైఎస్సార్ ని వెన్నంటి ఉండేవారు. వైఎస్సార్ ది గ్లామర్ అయితే కేవీపీది గ్రామర్ అని చెప్పుకునే వారు.
ఈ ఇద్దరూ కలసి కాంగ్రెస్ లో దశాబ్దాల పాటు ప్రయాణం చేశారు. ఇద్దరూ విజయ లక్ష్యాలను చేరుకున్నారు. ఇపుడు అదే కేవీపీ షర్మిలకు నీడగా ఉండబోతున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు ప్రత్యేక విమానంలో శనివారం వచ్చిన షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు ఉండడం విశేషం. అలాగే వైఎస్సార్ కి తోడుగా ఉండే మాజీ మంత్రి ప్రస్తుత సీడబ్లూసీ మెంబర్ అయిన ఎన్ రఘువీరారెడ్డి కూడా షర్మిలతో ఉన్నారు.
ఈ ఇద్దరు కాంగ్రెస్ దిగ్గజ నేతలు తన వెంట రాగా షర్మిల ఏపీలో అడుగు పెట్టారు. ఆమె కడప ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో సరైన డైరెక్షన్ నే తీసుకుంటున్నారు అని ఆమె వెంట ఉన్న వారిని బట్టి అర్ధం అవుతోంది.
ఇక షర్మిల మొదటిగా కడప వెళ్ళారు. ఇడుపులపాయలో ఆమె అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన మీదట ఆమె ఏపీ కాంగ్రెస్ ని తన రాజకీయ జీవితాన్ని కొత్త మలుపు తిప్పేలా చర్యలు తీసుకుంటారు అని అంతున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ మరణానంతరం ఇన్నాళ్లూ చాలా అరుదుగా కనిపించిన కేవీపీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీతో పునరాగమనం చేస్తున్నట్లు కనిపిస్తోంది అని అంటున్నారు.
నిజానికి చూస్తే కేవీపీ రాజకీయాలకు స్వస్తి పలికి చాలా కాలం అయింది. ఆయన ఎక్కడా కనిపించడంలేదు. మరి ఇపుడు ఆయన షర్మిల వెంట ఏపీకి రావడం అంటే ఆయన మార్క్ వ్యూహాలతో ఏపీ కాంగ్రెస్ షర్మిల సారధ్యంలో ముందుకు సాగుతుంది అని అంటున్నారు.
అంతే కాదు కేవీపీ ఇటీవల షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలో ఆయన వేదికపై కనిపించారు. ఇపుడు షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లే సమయంలో ఆయన వెంట ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పక్కనే ఉండే కేవీపీని ఆయన నీడగా అంతా చెప్పుకునే వారు.
అంతే కాదు ఆయన వైఎస్సార్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ముఖ్య సలహాదారుగా కూడా పనిచేశారు. అయితే వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ జగన్ వైపు వస్తారని అనుకున్నా అలా జరగలేదు. అంతే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో పదేళ్ళుగా కాంగ్రెస్ అచేతనంగా ఉంది. ఇపుడు తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది.
ఏపీలో కూడా కాంగ్రెస్ ని బలోపేతం చేసేందుకు కేవీపీ తనదైన రాజకీయ అనుభవాన్ని వైఎస్ షర్మిలకు అందిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఏపీలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో ఉన్న వైఎస్ షర్మిలకు కేవీపీ అనే కొండంత అండ దొరికినట్లు కనిపిస్తోంది.
ఇక కేవీపీకి వైసీపీలో చాలా మంది తెలుసు. అలాగే పాత కాంగ్రెస్ కాపులు ఆయనకు తెలుసు. ఏపీ రాజకీయాల్లో తలపండిన కేవీపీ కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల సీనియర్లను తీసుకుని వచ్చేలా తనదైన యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి వైఎస్ షర్మిల కేవీపీ కాంబో ఏపీ కాంగ్రెస్ ని ఏ విధంగా బలోపేతం చేస్తుందో మరి.