కొహ్లీపై అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు... తెరపైకి పాక్ ఫ్యాన్స్ టాపిక్!
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఈ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్.. ఆ దేశానికి వెళ్తోందా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారత్.. పాకిస్థాన్ లో పర్యటించేందుకు విముఖత చూపుతోంది.
ఈ వివాదం కొనసాగుతుండగానే.. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... ఇరు దేశాల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పక్కనపెట్టి.. విరాట్ కోహ్లీ ఒక్కసారి పాకిస్థాన్ లో పర్యటించాలని కోరాడు. అక్కడితో ఆగని అఫ్రీదీ... పాక్ గురించి ఎక్కువ ఊహించుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... భారత స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ ఒక్కసారి పాకిస్థాన్ గడ్డపై అడుగుపెడితే.. ఇక్కడి అభిమానుల నుంచి లభించే ప్రేమాభిమానాలకు ముగ్దుడవుతాడని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సందర్భంగా గతంలో పాకిస్థాన్ జట్టు భారత్ లో పర్యటించినప్పుడు లభించిన ప్రేమ, గౌరవాన్ని అఫ్రీదీ గుర్తుచేసుకున్నాడు.
ఇందులో భాగంగా... మేము గతంలో భారత్ లో పర్యటించినప్పుడు తమకు గొప్ప గౌరవం, ప్రేమ లభించాయని.. భారత్ చివరిసారిగా పాకిస్థాన్ లో పర్యటించినప్పుడు కూడా ఇదే జరిగిందని.. ఈ రెండు జట్లూ తలపడటాన్ని మించింది మరొకటి లేదని.. కాకపోతే ఈ జట్ల పర్యటనలు రాజకీయాలకు దూరంగా ఉంచాలని కొరాడు.
ఈ క్రమంలోనే... "పాక్ లో కోహ్లీ పర్యటిస్తే.. అతడికి భారత్ లో లభించిన ప్రేమను మరిచిపోతాడు.. కోహ్లీకి పాకిస్థాన్ లో భారీ క్రేజ్ ఉంది.. ఇక్కడి ప్రజలు అతడ్ని ఇష్టపడతారు. నా ఫేవరెట్ ప్లేయర్ కూడా కోహ్లీనే.. అతడికి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి.. అతడు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉండాల్సింది" అని షాహిద్ అఫ్రిదీ పేర్కొన్నాడు.