అమిత్ షా మీద ఇలాంటి విమర్శ ఎవరూ చేసి ఉండరేమో!?

ఆయన కేంద్ర హోం మంత్రిగా వరసగా రెండవ టెర్మ్ కూడా కొనసాగుతున్నారు.

Update: 2024-07-28 23:30 GMT

ఆయన కేంద్ర హోం మంత్రిగా వరసగా రెండవ టెర్మ్ కూడా కొనసాగుతున్నారు. గత పదేళ్లుగా బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో అత్యంత బలమైన నేతగా అమిత్ షా ఉంటూ వస్తున్నారు. ఆయనే కేంద్ర బిందువుగానే అన్నీ సాగుతున్న నేపధ్యం ఉంది. ఆయన కనుసన్నలలోనే అంతా సాగిపోతూ ఉంటుంది అని కూడా అంటారు.

ఆయన అంతలా దేశాన్ని పార్టీని శాసిస్తున్న నేతగా ముద్రపడ్డారు. అమిత్ షా ప్రధాని మోడీ తరువాత బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన ఆయా రాష్ట్రాలలో రాజకీయ ప్రత్యర్ధులను ఘాటైన పదజాలంతో విమర్శిస్తుంటారు.

అదే క్రమంలో అమిత్ షాను ప్రత్యర్ధులు విమర్శించినా ఆయన జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఇంతటి ఘాటు విమర్శను అయితే ఎపుడూ ఎదుర్కోలేదనే చెప్పాలని అంటున్నారు. ఇదే విధంగా చూస్తే మహారాష్ట్ర సీనియర్ నేత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మీద అమిత్ షా ఇటీవల కామెంట్స్ చేశారు. దేశంలో అవినీతిపరుల ముఠాకు ఆయన నాయకుడు అని కూడా తీవ్ర విమర్శలు చేశారు.

దానికి ప్రతిగా శరద్ పవార్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అమిత్ షా వంటి వ్యక్తి దేశానికి హోం మంత్రి కావడం విచిత్రం అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. నేను దేశంలోని అవినీతిపరుల ముఠాకు నాయకుడిని అంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

ఇదే నేపధ్యంలో ఆయన అమిత్ షా ఫ్లాష్ బ్యాక్ ని తవ్వి తీసే ప్రయత్నం చేశారు. ఒక కేసు విషయం సుప్రీం కోర్టు ఆయనను రెండేళ్ళ పాటు గుజరాత్ రాష్ట్రం నుంచి బహిష్కరించిందని శరద్ పవార్ గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు.

అటువంటి ఆయనే ఈరోజున మనకు దేశానికి హోం మంత్రి అని సెటైర్లు వేశారు. ఈ రోజున దేశం ఎలాంటి వారి చేతులలో ఉందో అందరూ ఆలోచించాలని కూడా శరద్ పవార్ కోరారు. ఇలాంటి వ్యక్తులు దేశాన్ని అవినీతి దారిలోనే నడిపిస్తారు అని అమిత్ షా మీద మండిపడ్డారు.

ఇది నిజంగా అమిత్ షా ఊహించని ప్రతి విమర్శగానే చూస్తున్నారు అమిత్ షా ఏ రాష్ట్రం వెళ్ళిన స్థానిక నేతలను రాష్ట్ర నేతలను విమర్శిస్తూంటారు. వారు కూడా ఆయన మీద తిరిగి విమర్శలు చేస్తారు. కానీ శరద్ పవార్ చేసిన విమర్శలో పదును చాలా ఉంది. దేశానికి హోం మినిస్టర్ గా అమిత్ షా ఉండడం బాధాకరం అనడమే కాకుండా ఆయన రాష్ట్ర బహిష్కరణ అంశాన్ని కూడా తవ్వి తీశారు. దీంతో ఇపుడు అమిత్ షా ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఏది ఏమైనా గత పదేళ్ళుగా చూస్తే మోడీ అమిత్ షాల మీద విమర్శలు చేయడానికి తలపండిన రాజకీయ నేతలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు అని అంటున్నారు. మూడవసారి దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా మిత్రులతోనే అది బండి లాగుతోంది. నానాటికీ బీజేపీ గ్రాఫ్ తగ్గుతోంది. దాంతోనే శరద్ పవార్ లాంటి వారు పవర్ ఫుల్ డైలాగులు వదులుతున్నారు. అమిత్ షా ఫ్లాష్ బ్యాక్ ఈ దేశంలో చాలా మందికి తెలియదు. దానిని బయటకు తెచ్చి మరీ కెలికి వదిలిపెట్టారు శరద్ పవార్ అని అంటున్నారు.

ఇది ఆరంభం మాత్రమే అని ముందు ముందు ఇంకా గట్టిగానే ఇండియా కూటమి నేతల నుంచి ఎండీయే పెద్దలకు ఘాటు విమర్శలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి అమిత్ షా శరద్ పవార్ ని విమర్శించి అంతకు పదింతల విమర్శను కొని తెచ్చుకున్నారా అన్న చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News