టీడీపీని డామినేట్ చేస్తున్న ష‌ర్మిల‌..!

రాజ‌కీయాల్లో డామినేష‌న్ అనేది అవ‌స‌రం. ఒక పార్టీపై మ‌రో పార్టీ పైచేయి సాధించ‌డం కూడా సాధార‌ణ మే.

Update: 2024-10-01 07:46 GMT

రాజ‌కీయాల్లో డామినేష‌న్ అనేది అవ‌స‌రం. ఒక పార్టీపై మ‌రో పార్టీ పైచేయి సాధించ‌డం కూడా సాధార‌ణ మే. అయితే.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల చేస్తున్న డామినేష‌న్ రాజ‌కీయాల ముందు.. టీడీపీ నేత‌లు చేతులు ఎత్తేస్తున్నారు. ఏ విష‌యంపైనైనా ముందు ష‌ర్మిలే జోరుగా స్పందిస్తున్నారు. ఆ త‌ర్వాతే టీడీపీ నాయ‌కులు రియాక్ట్ అవుతున్నారు. ప్ర‌తిప‌క్షం వైసీపీని క‌ట్ట‌డి చేయ‌డంలోనూ.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డంలోనూ.. ష‌ర్మిల చూపిస్తున్న దూకుడు రోజు రోజుకు పెరుగుతోంది.

అత్యంత కీల‌క విష‌యాలైన పోల‌వ‌రం, అమ‌రావ‌తి, వ‌ర‌ద‌లు, గ‌నుల కుంభ‌కోణం, మ‌ద్యం కుంభ‌కోణం.. ఇలా అన్న విష‌యాల్లోనూ.. వైసీపీని టార్గెట్ చేయ‌డంలో ష‌ర్మిల దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నేరుగా తాడేప‌ల్లి ప్యాలెస్‌ను ఆమె టార్గెట్ చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ ఉక్కిరికి గుర‌వుతున్నారు. స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే.. వాస్త‌వానికి టీడీపీని గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్‌ను మించిన నాయ‌కులు, నెట‌వ‌ర్క్ కూడా ఎక్కువ‌గా ఉంది.

అనేక మంది ఫైర్ బ్రాండ్ నాయ‌కులు టీడీపీకి ఉన్నారు. కానీ, వారికంటే కూడా ష‌ర్మిల సూప‌ర్ సోనిక్ విమానం వేగంతో వైసీపీని, ఆ పార్టీ అధినేత‌ను కూడా ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అటు మీడియా ముందు.. ఇటు సోష‌ల్ మీడియాలోనూ ష‌ర్మిల చేస్తున్న విమ‌ర్శ‌లు.. ఘాటుగా ఉంటున్నాయి. అంతేకాదు.. టీడీపీ నేత‌ల‌కు కూడా రాని ఐడియాలు, విమ‌ర్శ‌లు ఆమె చేస్తున్నాయి. గ‌నుల కుంభ‌కోణం వ్య‌వ‌హారంపైటీడీపీ ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను నేరుగా టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించ‌లేదు. క‌నీసం.. తాడేప‌ల్లి ప్యాలెస్ పాత్ర ఉంద‌ని కూడా చెప్ప‌లేక‌పోయారు. కానీ, ష‌ర్మిల ఉతికి ఆరేసింది. తాడేప‌ల్లి ప్యాలెస్ పేరు చెప్పి మ‌రీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇలా ఇటీవ‌ల కాలంలో అనేక విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో టీడీపీ నాయ‌కులు త‌ర్వాత మేల్కొన్నారు. అంతేకాదు.. జ‌గ‌న్పై విమ‌ర్శ‌లు చేస్తూ.. ``ముందుగా ఈ విష‌యాన్ని నీ చెల్లెలే బ‌య‌ట పెట్టింది`` అంటూ చెప్ప‌డం కూడా గ‌మ‌నార్హం. సో.. మొత్తంగా చూస్తే.. వైసీపీని టార్గెట్ చేయ‌డంలో టీడీపీని ష‌ర్మిల పూర్తిగా డామినేష‌న్ చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News