షర్మిల 12 డిమాండ్స్.. ఒక్కటి నెరవేరినా గ్రేట్ లీడర్..
రాష్ట్ర రాజకీయాల్లో తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల తాజాగా అంగన్‌వాడీల సమస్యపై ప్రభుత్వంతో కొట్లాటకు సిద్ధమయ్యారు.;
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రంలో పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇతర పార్టీలో ఢీ అంటే ఢీ అన్నట్లు కొట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీని టార్గెట్ చేసిన షర్మిల.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైనా ఎక్కువ ఫోకస్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల తాజాగా అంగన్‌వాడీల సమస్యపై ప్రభుత్వంతో కొట్లాటకు సిద్ధమయ్యారు.
వేతనాలు పెంచాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించిన పీసీసీ చీఫ్ షర్మిల వారి కోసం ప్రభుత్వానికి 12 డిమాండ్లు చేశారు. మహిళా సంక్షేమంతోపాటు చిరుద్యోగుల ఉద్యోగ భద్రతపై షర్మిల పెట్టిన డిమాండ్స్ ఆసక్తికర చర్చకు తెరలేపాయి. విపక్షం వైసీపీ కన్నా షర్మిల ఎక్కువగా రియాక్ట్ అవ్వడం కూడా ఆకర్షిస్తోందని అంటున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తామంటోన్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని షర్మిల ఆరోపించారు. అంగన్‌వాడీ కార్యకర్తల గొంతునొక్కి ఉద్యామాన్ని అణిచివేయాలని చూడటం ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు నిదర్శనమన్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తలను చర్చలకు పిలవానికి వారి నెల జీతం రూ.26,000 పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని కోరారు. హెల్పర్లకు పదోన్నతులు, పెండింగ్ పోస్టుల భర్తీ, విధి నిర్వహణలో మరణించిన అంగన్‌వాడీ కార్యకర్త కుటంబంలో ఒకరికి ఉద్యోగం, మట్టి ఖర్చుల కింద రూ.20,000 వేల ఆర్థిక సాయం వంటి 12 డిమాండ్లను షర్మిల ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిలో ఎన్నింటిపై సర్కారు స్పందిస్తుందో చూడాల్సివుంది.