ఒప్పందం తుంగలోకి... ఆస్తుల విషయంపై షర్మిళ ఘాటు లేఖ!
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాసిన లేఖ ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాసిన లేఖ ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. కుటుంబ ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు వాటా లేకుండా చేస్తున్నారంటూ జగన్ పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
అవును... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైఎస్ విజయమ్మ, షర్మిల పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి గల కారణాలు, తనను తెలియకుండా షేర్లు బదిలీ చేసుకున్న వ్యవహారాలను వివరిస్తూ జగన్ రాసిన లేఖ కంటే... జగన్ పై సంచలన ఆరోపణలు చేస్తూ.. లీగల్, మోరల్ విషయాల మేళవింపుతో షర్మిల రాసిన లేఖ సంచలనంగా మారింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్!
ఈ సందర్భంగా షర్మిళ లేఖలో... తండ్రి వైఎస్సార్ సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని షర్మిల ఆరోపించారు. తమకు అరకొర ఆస్తులిచ్చి వెళ్లగొట్టాలని చూడటమే కాకుండా.. ఆస్తుల పంపకానికి సంబంధించి చేసుకున్న ఎంవోయూని కూడా తుంగలో తొక్కారని అన్నారు.
ఇక, ప్రధానంగా... "భారతి సిమెంట్స్, సాక్షి పత్రికలతో పాటు తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా చెందాలని మన తండ్రి ఆదేశించారు" అని గుర్తుచేసిన షర్మిల.. "ఆయన ఆదేశాలతో పాటు మన తల్లి విజయమ్మ సాక్షిగా చేసుకున్న ఎంవోయూలో ప్రస్థావించిన ఆస్తుల వివరాలు.. మన తండ్రి ఇచ్చిన ఆదేశాల్ని పాక్షికంగా నెరవేర్చేలా ఉన్నాయి" అని అన్నారు.
ఇక్కడ షర్మిళ "పాక్షికంగా" అని నొక్కి చెప్పడం వెనుక ఉన్న పరమార్ధాన్ని వివరించరు. ఇందులో భాగంగా... భారతీ సిమెంట్స్, సాక్షిల్లో మెజారిటీ వాటాలు మీరే ఉంచుకున్నారు కాబట్టి.. "పాక్షికం" అనే మాటను నొక్కి చెబుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఇదే సమయంలో... "తోడబుట్టిన అన్నయ్యతో వివాదాన్ని కొనసాగించి కుటుంబాన్ని రచ్చకెక్కించడం ఇష్టం లేక మన ఆస్తిలో సమాన వాటా పొందేందుకు నాకున్న హన్నుకు వదులుకునేందుకు అంగీఅక్రించాను" అని షర్మిల స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో... "2019 ఆగస్టు 31న చేసుకున్న ఎంవోయూ ప్రకారం మీ సొంత చెల్లెలు, ఆమె పిల్లలకు చెందాల్సిన అస్తుల్ని వారికి దక్కకుండా చేసేందుకు కంకణం కట్టుకుని.. దానికోసం ఏకంగా సొంత తల్లిపైనే కేసు పెట్టే స్థాయికి దిగజారారు.. మహోన్నతుడైన మన తండ్రి నడిచిన మార్గానికి మీరు ఎంత దూరంగా వెళ్తున్నారో చూసి దిగ్భ్రాంతి చెందుతున్నాను" అని షర్మిళ అన్నారు.
"నాకు అన్నగా.. నా పిల్లలతో రక్తసంబంధం ఉన్న మామగా మీరు ఇష్టపూర్వకంగా సంతకం చేసిన ఒప్పందాన్ని తూచ తప్పక అమలు చేయడం మీ బాధ్యత.. మీరు నైతికంగా దిగజారిపోయిన లోతుల్లో నుంచి పైకి రావాలని.. తండ్రి ఆదేశాలను నెరవేర్చాలని ఇప్పటికీ ఆశిస్తున్నాను.. మీరు ఆ పని చేయకపోతే చట్టప్రకారం నాకున్న మార్గాల్లో వెళ్తాను.." అని క్లారిటీ ఇచ్చారు షర్మిళ.
ఇలా సెప్టెంబర్ 12నాటి లేఖలో షర్మిళ.. తన సోదరుడు తమ మధ్య సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయు) నెరవేర్చడంలో విఫలమయ్యారని, అదే విధంగ తమ తండ్రికి చెందిన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్స్ కి ఆస్తులను సమానంగా పంచడానికి నిరాకరించడంపై తన మనోవేదనను షర్మిల వివరించారు.