అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదు.. జగన్ పై షర్మిల ఫైర్

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ ట్వీట్ చేసినా ఎక్కువగా వైసీపీ అధినేతనే టార్గెట్ చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

Update: 2025-02-19 12:53 GMT

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి టార్గెట్ చేశారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పాలకపక్షాన్ని నిలదీసే దమ్ము , ధైర్యం వైసీపీ అధ్యక్షుడికి లేవంటూ విమర్శించారు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని చెప్పారు. నిన్న విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంశీ పరామర్శకు వెళ్లిన జగన్ వైఖరిని విమర్శిస్తూ ఆమె ఎక్స్ లో ట్వీట్ చేయడం చర్చనీయాంశమవుతోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ ట్వీట్ చేసినా ఎక్కువగా వైసీపీ అధినేతనే టార్గెట్ చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించిన జగన్.. అసెంబ్లీకి వెళ్లి అధికార పక్షాన్ని నిలదీయలేరా అంటూ షర్మిల నిలదీశారు. ఈ రోజు ఆమె ఎక్స్ వేదికగా అధికార పక్షంతోపాటు, విపక్షంపైనా విమర్శల దాడి చేయడంపై చర్చ జరుగుతోంది. ‘‘సీఎం చంద్రబాబు గారి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్. పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై , సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈనెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించండి. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయండి. ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోండి.’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేసిన షర్మిల పనిలో పనిగా తన సోదరుడు, మాజీ సీఎం జగన్ పైనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

‘‘కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన YCPకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ములేదు. జగన్ మోహన్ రెడ్డి గారికి నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు. ప్రెస్ మీట్ లు పెట్టీ పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ గారికి లేదు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత అసలే లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలి.’’ అంటూ షర్మిల డిమాండ్ చేశారు.

అయితే షర్మిల ట్వీట్ పై వైసీపీ ఇప్పటివరకు ప్రతిస్పందించలేదు. తాము విపక్షంలో ఉన్నా తమ పార్టీనే షర్మిల టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న వైసీపీ.. జగన్ అసెంబ్లీకి వెళ్లాలనే ఆమె సూచనను ఎలా తీసుకుంటుందనేది చూడాల్సివుంది. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తామని అధికార పక్షం బెదిరిస్తున్న వేళ.. జగన్ కు అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదంటూ షర్మిల ట్వీట్ చేయడం ఆయనను రెచ్చగొట్టడమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా షర్మిల ట్వీట్ పొలిటకల్ గా హీట్ పుట్టిస్తోంది.

Tags:    

Similar News