జగన్‌ను నేరుగా ఢీ కొట్టలేక.. షర్మిల అగచాట్లు
వాస్తవానికి కాంగ్రెస్‌ను టార్గెట్ చేయాలని అనుకున్నప్పుడు.. గత పథకాలు తీసుకువస్తామని కానీ, వైఎస్ పాలనలోని మంచి చెడులను కానీ షర్మిల ప్రజలకు వివరించారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని జాకీలు వేసి లేపాలని ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిలకు.. అది ఎంత వరకు సాధ్యమో తెలియదు కానీ.. వ్యక్తిగతంగా మాత్రం ఆమె బ్యాడై పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. వైఎస్ కుటుంబం గతంలో ఎప్పుడూ.. రోడ్డున పడలేదు. ఎంతో మంది నాయకులను తీసుకువచ్చిన ఈ కుటుంబం, ఈ కుటుంబం నుంచి ఎంతో మంది వచ్చినా.. ఎప్పుడు ఇలా క్యారెక్టర్ చంపుకొనేలా వ్యవహ రించలేదన్నది వాస్తవం.
చిన్న చిన్న పొరపాట్లు.. సర్దుబాట్లు ఎప్పుడూ ఉంటాయి. అయినప్పటికీ.. వైఎస్ కుటుంబం ఏనాడూ ఇప్పుడు జరుగుతున్న రేంజ్‌లో అయితే... రోడ్డున పడి విమర్శలు చేసుకున్నది కానీ.. దుమ్మెత్తి పోసుకున్నది కానీ లేదు. అయితే.. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిల కూడా తన పనితాను చేసుకుపోయారు. హైదరాబాద్‌లో ఎన్నో ప్రెస్‌మీట్లు పెట్టినా.. పార్టీని స్థాపించి పాదయాత్ర చేసినా.. షర్మిల ఏనాడూ వైఎస్ జగన్ విషయంలో నోరు విప్పలేదు.
అంతేకాదు.. అవకాశం వచ్చినప్పుడు, అంటే.. తెలంగాణ విపక్ష పార్టీలు వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా షర్మిల పెదవి విప్పకుండా జాగ్రత్త వహించారు. ఇక, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక మాత్రం జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ విషయం చర్చకు వస్తోంది. గ్రామీణ స్థాయిలో షర్మిల వ్యాక్యలపై ఒకప్పుడు మంచి అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మాత్రం అలా లేదు.
వాస్తవానికి కాంగ్రెస్‌ను టార్గెట్ చేయాలని అనుకున్నప్పుడు.. గత పథకాలు తీసుకువస్తామని కానీ, వైఎస్ పాలనలోని మంచి చెడులను కానీ షర్మిల ప్రజలకు వివరించారు. అయితే.. దీనికివిరుద్ధంగా.. జగన్ పాలనలో అస్సలు ఏమీ జరగలేదన్నట్టుగా, ఆయన ఐదేళ్ల పాటు పాలన చేయలేదన్నట్టుగా.. అసలు ఏపీలో జనాలకు రూపాయి కూడా లబ్ధి జరగలేదన్నట్టుగా షర్మిల ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్‌ను జాకీలేసి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడెలా ఉందో.. మరికొన్నేళ్ల వరకు కూడా అలానే ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో షర్మిల వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలతో ఆమె బ్యాడైపోతారని అంటున్నారు పరిశీలకులు.